ఉప్పూ, నూనె, చక్కెర మితిమీరి తీసుకుంటే ముప్పే మరి...
- February 05, 2016
మనసు బాగోలేకపోతే కప్పు కాఫీ లేదా టీ.. ఏమీ తోచనప్పుడు రకరకాల చిరుతిళ్లూ... భోజనంలో పచ్చళ్లూ, కూరలూ.. వేడుక ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడూ తీపి పదార్థాలూ తినేస్తూ ఉంటాం! ఇవన్నీ తినేప్పుడు బాగానే ఉంటాయి. ఆ తరవాతే సమస్యలు తెచ్చిపెడతాయి. కారణం వాటిల్లో ఉండే ఉప్పూ, నూనె, చక్కెరలే! అతి ఎప్పుడూ అనర్థమే అన్నట్లు ఈ మూడూ మితిమీరి తీసుకుంటే ముప్పే మరి. అదెలా.. అసలు వాటిని ఎందుకు తగ్గించాలి.. ఎంత తీసుకోవాలనేది చూద్దాం. కొ న్ని పదార్థాలు చూస్తూనే నోరూరిస్తాయి. వాటిల్లో వేపుళ్లు ముందుంటాయి.అందుకే చాలా సందర్భాల్లో నోరు కట్టేసుకోకుండా తినేస్తాం. కానీ నూనెతో చేసిన పదార్థాల వల్ల అందే పోషకాలు కొన్నే, కెలొరీలు మాత్రం ఎక్కువే. పైగా వాటిని ఖఎమ్టీ కెలొరీలుగ అంటారు. మనం రోజూ తీసుకునే ఆహారంలో పీచూ, మాంసకృత్తులూ, పిండిపదార్థాలతో పాటూ కొవ్వూ అవసరమే కదా! నిజమే, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల పని తీరుకు కొంతవరకూ కొవ్వు అవసరమే. అది ఎంతంటే నలభై గ్రాములు మాత్రమే. దాన్ని పూర్తిగా నూనె నుంచి తీసుకోవాలని లేదు. సగం నూనె నుంచీ, మిగిలిన కొవ్వుని అన్నం, ఇతర కూరగాయలూ, పాల పదార్థాల నుంచి పొందొచ్చు. చాలామంది దీన్ని గమనించుకోకుండా భోజనం, నూనె నుంచీ కొవ్వు పదార్థాన్ని శరీరానికి చేరవేస్తుంటారు. దాంతో బరువు పెరిగిపోయి.. ఆరోగ్య సమస్యలూ, హార్మోన్ల పనితీరులో తేడాలు మొదలవుతాయి. నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చలేకపోవడం, పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్).. మొటిమలూ, అవాంఛిత రోమాలూ, జుట్టు వూడటం వంటివెన్నో ఇబ్బంది పెడతాయి. బరువు ఎముకలపైనా ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదమూ ఎక్కువే. మరికొందరు సన్నబడాలనే ఉద్దేశంతో నూనెను పూర్తిగా మానేస్తారు. దాంతో శరీరంలో కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. అప్పుడూ నెలసరిలో ఆటంకం, గర్భం దాల్చలేకపోవడం లాంటివి తప్పవు. ఇవన్నీ ఒకెత్తయితే అధిక కొవ్వు వల్ల కొలెస్ట్రాల్, గుండెజబ్బుల్లాంటివీ ఎదురవుతాయి. నూనె ఎంత తీసుకోవాలంటే: ఎలాంటి అనారోగ్యాలు లేకుండా యాభై అయిదు కేజీల బరువున్న ఓ మహిళకు రోజుకు నాలుగు చెంచాల నూనె సరిపోతుంది. అధిక బరువుంటే.. ఆ వాడకాన్ని ఇంకా తగ్గించుకోవాలి. నూనె వినియోగానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులుంటే రోజుకు ఇరవై ఎంఎల్ నూనె చొప్పున లెక్కించుకోవాలి. అంటే రోజుకు ఎనభై ఎంఎల్. నెలకు రెండున్నర లీటర్లు.. ఇది ప్రాథమికంగా చేసుకోవాల్సిన మార్పు. ఒకపూట వేపుడు తింటుంటే.. మరోపూట తీసుకునే ఆహారంలో నూనె తక్కువగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంత వరకూ తక్కువగా వాడాలి. కూరలు చేసుకుంటున్నప్పుడు కూడా వేపుళ్లే చేసుకోవాలని లేదు. వాటిని ముందు ఉడికించి, తరవాత కూరలా చేసుకోవచ్చు. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. రుచిలోనూ ఏ తేడా ఉండదు. వండటానికి ఎక్కువ సమయం పడుతుందంతే. నాన్‌స్టిక్ పాన్లూ, ఆయిల్ స్ప్రేలూ ఎంచుకోవడం వల్ల కొంత వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఏదో ఒక నూనె అని కాకుండా.. రెండు రకాలు కలిపి వాడటం అలవాటు చేసుకోవాలి. పల్లీలనూనెలో కనోలా నూనె కలపడం, రైస్‌బ్రాన్, సోయాబీన్ కలిపి వాడటం, రైస్బ్రాన్తో పాటూ ఆవనూనెని కలపడం.. ఏది కలుపుతున్నా ఒమెగా త్రీ, ఒమెగా సిక్స్‌లు మేళవించి ఉండేలా చూసుకోవాలి. స్థూలకాయం తగ్గించుకునేలా.. చక్కెరా, తేనె, బెల్లం నుంచీ ఎంమ్టీ కెలొరీలు అందుతాయి. చెంచా చక్కెర తీసుకుంటే ఇరవై కెలొరీలు అందుతాయి. శరీరానికి అవసరమయ్యే చక్కెరను కేవలం దాన్నుంచే పొందాలని లేదు. కొంత మోతాదును చక్కెర నుంచీ, మిగిలింది పండ్లూ, అన్నం నుంచీ పొందవచ్చు. సాధారణంగా తీపి అనగానే మనం చక్కెర గురించి ఆలోచించి, మానేస్తే సరిపోతుందనుకుంటాం. కానీ అప్పుడప్పుడూ తీసుకునే మిఠాయిల్లో చక్కెరా, నెయ్యీ కలిసి ఉంటాయి. పళ్ల రసాలూ, జెల్లీలూ, స్క్వాష్లూ, జామ్లలోనూ చక్కెర వినియోగం ఎంతో కొంత ఉంటుంది. దాంతో తెలికుండానే ఎక్కువ చక్కెర తీసుకుంటాం. ఇది పెరిగే కొద్దీ మధుమేహం, శరీరంలో ట్రైగ్లిజరాయిడ్ల సమస్య పెరిగిపోతుంది. చర్మ సంబంధ సమస్యలూ ఎదురవుతాయి. ఇదీ ఓ విధంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది కాబట్టి మధుమేహంతో పాటూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లూ, ఈస్ట్ ఇన్ఫెక్షన్లూ మహిళల్ని ఇబ్బంది పెడతాయి. ఒక వయసొచ్చాక ఎముకల సమస్యలూ తప్పవు. ఏది పరిష్కారం: శరీరానికి ఎంతో కొంత నూనె అవసరమే! కానీ చక్కెర అస్సలు అవసరం లేదు. మానేసినా ఫరవాలేదు. ఒకవేళ దీన్ని పూర్తిగా మానేయడం కష్టం అనుకున్నప్పుడు సహజంగా తీపి లభించే పదార్థాలూ, పండ్లూ ఎక్కువగా తినాలి. ఓట్స్ లాంటివి తీసుకుంటున్నప్పుడు చక్కెర బదులు పండ్లు లేదా పండ్లతో చేసిన గుజ్జును ఎంచుకోవచ్చు. పండ్ల రసాలు పూర్తిగా మానేయాలని లేదు. మోతాదును తగ్గించుకుంటూ కొన్నాళ్లకు పూర్తిగా తగ్గించాలి. కాఫీ, టీ వినియోగం కూడా అంతే. రోజులో నాలుగు కప్పులు తీసుకుంటుంటే రెండింటికి తగ్గించాలి. ఒక కప్పు తీసుకుంటుంటే చిన్న కప్పును ఎంచుకోవాలి. బేకరీ పదార్థాలూ, మిఠాయిలూ, డెసర్ట్లాంటివి మానేసి పండ్లూ, పెరుగూ కలిపి తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. బజార్లో కొనే పదార్థాల్లో చక్కెర మోతాదు ఎంత ఉందనేదీ నిర్థరించుకోవాలి. ఆరు గ్రాములు చాలు.. ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ లవణం శరీరానికి చాలా అవసరం. సోడియం నరాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. కండరాల సంకోచ, వ్యాకోచానికీ తోడ్పడుతుంది. అలాగని అతిగా తింటే ప్రమాదమే. దీని వినియోగం పెరిగేకొద్దీ రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మెదడు మాత్రమే కాదు, మూత్రపిండాల పని తీరుపైనా ప్రభావం చూపుతుంది సోడియం. ఇది ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కొన్నిసార్లు అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో మెనోపాజ్ దాటాక ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. కొందరిలో అధికరక్తపోటు మొదలై.. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే గుండె సమస్యలూ వస్తాయి. ఇవన్నీ ఒకెత్తయితే అధిక సోడియం వల్ల శరీరం ఉబ్బుతుంది. ముఖ్యంగా కాళ్లూ చేతులూ, పాదాల్లో నీరు చేరి ఆ భాగాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అల్సర్లూ రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ అదుపులో ఉంచాలంటే సోడియం అందించే ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి. నిమ్మరసం వాడాలి: ఎవరికయినా రోజులో ఆరు గ్రాముల ఉప్పు అంటే.. చెంచా సరిపోతుంది. దాన్ని గమనించుకుంటూ తక్కువ వేసుకోవడం మొదలుపెట్టాలి. ప్రిజర్వేటివ్‌లు ఉన్న పదార్థాలు చాలా తక్కువగా తినాలి. అంటే పచ్చళ్లూ, అప్పడాల్లాంటివి. వాటిల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుంది. కొన్ని పదార్థాల్లో ఉప్పును తగ్గించి, వాటికి బదులు నిమ్మరసం పిండుకోవచ్చు. అలాగని పూర్తిగా మానేయాలని లేదు. రోజు మొత్తానికి అరచెంచా తీసుకుంటే సరిపోతుంది. కొందరు మహిళలకు చెమట ఎక్కువగా పడుతుంది. ఇలాంటి వారికి కొంత సోడియం అవసరం. ముఖ్యంగా గర్భిణులకు తప్పనిసరి కాబట్టి మోతాదు మించకుండానే తీసుకోవాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









