రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్

- September 21, 2020 , by Maagulf
రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్

న్యూఢిల్లీ:పార్లమెంటు ఎగువసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, రాజ్యసభ చరిత్రలో అదో దుర్దినం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. అది దురదృష్టకరం, అనంగీకారం, ఖండించదగినది’ అని ఆయన సోమవారం పేర్కొన్నారు. 

కొందరు సభ్యులు.. కరోనా నేపథ్యంలో సురక్షిత దూరం పాటించాలన్న నిబంధలను ఉల్లంఘించించారని కూడా చైర్మన్ పేర్కొన్నారు. ‘మనమే కరోనా నిబంధనలను పాటించకపోతే.. సామాన్య ప్రజలు పాటించాలని ఎలా అనుకుంటాం?’ అని ప్రశ్నించారు.
కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి పేపర్లు, రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్‌పై విసిరేసి ఆయన్ను దూషించిన విషయాన్ని చైర్మన్ గుర్తుచేశారు. మరికొందరు సెక్రటరీ జనరల్ బల్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ, గంతులు వేశారని, పేపర్లు చించేశారని,  మైకులు విరగ్గొట్టి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ‘ఇదేనా పార్లమెంటరీ స్థాయి. దీనిపై సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని చైర్మన్ పేర్కొన్నారు.

డిప్యూటీ చైర్మన్‌ను భౌతికంగా భయపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఒకవేళ సమయానికి మార్షల్స్ ను పిలిచి ఉండకపోతే డిప్యూటీ చైర్మన్‌గారికి ఏమై ఉండేది. ఇది చాలా బాధాకరం’ అని చైర్మన్ పేర్కొన్నారు. అభ్యంతకర పదజాలంతో తనను దూషించారన్న డిప్యూటీ చైర్మన్ ప్రకటనను రాజ్యసభ చైర్మన్ గుర్తుచేశారు. 

ఒకవేళ సభ్యుల వద్ద సరైన సంఖ్యాబలం ఉన్నట్లయితే వారు చర్చించి ఉండాల్సిందని.. అలా కాకుండా.. సీట్లలోనే ఉంటే  ఓటింగ్‌ నిర్వహిస్తామని డిప్యూటీ చైర్మన్ చెబుతున్నా ఇలా దూకుడుగా వ్యవహరించడం సరికాదన్నారు. సభ సజావుగా సాగితే.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసే అవకాశం విపక్ష సభ్యులకు ఉండేదన్నారు. ఆదివారం నాడు రాజ్యసభలో జరిగిన ఘటన పార్లమెంటు గౌరవానికి మరీ ముఖ్యంగా పెద్దలసభ మర్యాదకు భంగం కలిగించిందని చైర్మన్ అన్నారు. కొందరు సభ్యులు తాము చేసిన పనిని ప్రసారమాధ్యమాలు వేదికగా అంగీకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చైర్మన్ గుర్తుచేశారు. 

మరోవైపు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. వారిని తొలగించాలంటూ.. ప్రతిపక్ష నేత, 46 మంది రాజ్యసభ సభ్యుల నుంచి తనకు లేఖ అందిందని చైర్మన్  ముప్పవరపు వెంకయ్యనాయుడు వెల్లడించారు.

డిప్యూటీ చైర్మన్‌పై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం నాటి సభాకార్యక్రమాలను తాను క్షుణ్ణంగా పరిశీలించానని ఆయన అన్నారు. వెల్‌లోకి వచ్చిన సభ్యులు సీట్లలోకి వెళ్లి కూర్చుంటే బిల్లుపై చర్చించి సవరణలు సూచించేందుకు వీలుంటుందని డిప్యూటీ చైర్మన్ పదే పదే పేర్కొన్న విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు. ‘సభలో గందరగోళం కొనసాగటం కారణంగానే బిల్లుపై చర్చ సాధ్యం కాలేదు. ఇదే సమయంలో కొందరు సభ్యులు పార్లమెంటు గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా.. ప్రవర్తించారు’ అని చైర్మన్ పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని నియమాలు, రాజ్యసభ నిబంధనలు, గతంలో జరిగిన ఘటనలన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత, ఇతర సభ్యులు ఇచ్చిన లేఖ సరైన ఫార్మాట్ లేదని చైర్మన్ వెల్లడించారు. 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 90(సీ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఇలాంటి తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు 14రోజుల నోటీస్ పీరియడ్ తప్పనిసరి అని చైర్మన్ స్పష్టం చేశారు. ‘అక్టోబర్ 1, 2020న సభ నిరవధిక వాయిదా పడనున్నందున.. ఈ నోటీసులు జారీ చేసేందుకు 14రోజుల సమయం లేదు. అందుకే ప్రతిపక్ష నేత, ఇతర సభ్యులు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నాను’ అని చైర్మన్ స్పష్టం చేశారు. 
 
గమనిక:
భారత రాజ్యాగంలోని ఆర్టికల్ 90(సీ):
డిప్యూటీ చైర్మన్‌ను వారి బాధ్యతలనుంచి తొలగించేందుకు సభలో తీర్మానాన్న ప్రవేశపెట్టి.. హాజరైన సభ్యుల మెజారిటీ ఆమోదం తప్పని సరిగా పొందాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సరైన కారణాన్ని పేర్కొంటూ.. కచ్చితంగా 14రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com