మస్కట్ విమానాశ్రయంలో తక్కువ ఖర్చుతో డ్రైవ్ త్రూ పీసీఆర్ టెస్ట్

- October 18, 2020 , by Maagulf
మస్కట్ విమానాశ్రయంలో తక్కువ ఖర్చుతో డ్రైవ్ త్రూ పీసీఆర్ టెస్ట్

మస్కట్:ప్రయాణికులకు సులభంగా పీసీఆర్ టెస్టులు నిర్వహించటంతో పాటు వేగంగా రిపోర్ట్ ఇచ్చేలా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసింది ఒమన్ ప్రభుత్వం. పార్కింగ్ ఏరియాలోని పీ5 పార్కింగ్ స్లాట్ లో అక్టోబర్ 1 నుంచి డ్రైవ్ త్రూ పీసీఆర్ టెస్టులను నిర్వహిస్తోంది. అయితే..కేవలం 19 ఒమన్ రియాల్స్ చెల్లించి పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టు రిపోర్టులను కూడా 24 గంటల్లో ఎస్ఎంఎస్ ద్వారాగానీ, మెయిల్ ద్వారాగానీ పంపిస్తున్నారు. తక్కువ ఖర్చులో వేగంగా ఫలితాలను ఇస్తుండటం ప్రయాణికులకు డ్రైవ్ త్రూ పీసీఆర్ టెస్ట్ ఎంతో ప్రయోజనకరంగా పాపులర్ అయ్యింది. పీ5 పార్కింగ్ స్లాట్ లో నిర్దేశించిన డ్రైవ్ త్రూ టెస్ట్ పాయింట్ ను సులభంగా గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక పీ5 పార్కింగ్ స్లాట్ ను డ్రైవింగ్ త్రూ పీసీఆర్ టెస్టులకు కోసం కేటాయించటంతో పార్కింగ్
ఫీజులను కూడా సవరించింది. తొలి రెండు గంటల తర్వాత పార్కింగ్ ఛార్జ్ ను విధిస్తున్నారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం పార్క్ చేసిన వాళ్లందరికీ లాంగ్ టర్మ్ పార్కింగ్ కింద చార్జ్ చేస్తున్నారు. 

ఇక ఇతర ప్రాంతాల నుంచి మస్కట్ చేరుకునే ప్రయాణికుల కోసం విమానాశ్రయంలోనే పీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒమన్ చేరుకునే ప్రతి ప్రయాణికుడు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని లగేజ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలి. అందుకు 25 ఒమన్ రియాల్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే..15 ఏళ్లలోపు వారికి మాత్రం పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే..ఒమన్ వచ్చే వాళ్లందరూ ప్రయాణానికి ముందే తారాసుద్, హెచ్ ముష్రిఫ్ యాప్ లను డౌన్ చేసుకొని తమ వివరాలను https://covid19.moh.gov.om/#/traveler-reg లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు సూచించారు. యాప్ లో వివరాల నమోదు చేసుకోవటం ద్వారా భారీ క్యూ లైన్లలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక దౌత్యవేతలు, వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ ట్రాకింగ్ నుంచి మినహాయింపు ఇచ్చినా..కోవిడ్ పరీక్షలు మాత్రం యధావిధిగా చేయించుకోవాలని, వారం కంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిన వారు క్వారంటైన్ పాటించాలని తెలిపారు. విమానాశ్రయ సిబ్బందికి మాత్రం క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉన్నా..కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com