హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
- October 29, 2020_1603960258.jpg)
హైదరాబాద్:కోవిడ్ అనేక ఇతర విమానయాన రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మే 25 నుండి క్రమంగా దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అనుమతించిన దేశాలతో ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ క్రింద అంతర్జాతీయ విమాన సర్వీసులూ ప్రారంభమయ్యాయి.
ఈ మొత్తం దృక్పథం భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని వెల్లడిస్తోంది. అన్‌లాక్ 4.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులు ఇవ్వగా, అన్‌లాక్ 5.0 కింద మరిన్ని నిబంధనలను సడలించారు. ఇది విమానయాన రంగానికి ఊతం ఇచ్చింది.
మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, ఇతర భారతీయ విమానాశ్రయాలతో పోల్చితే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వృద్ధి వేగం ఎక్కువగా ఉంది.
దేశీయ విమాన సర్వీసులు
మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాలలో ప్రతిరోజూ సుమారు 3000 మంది దేశీయ ప్రయాణీకుల నుండి, నేడు ప్రయాణీకుల సంఖ్య రోజూ 20,000 ను దాటిపోయింది. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన దానితో పోలిస్తే ఇది 6 రెట్లు. విమానాశ్రయం తిరిగి ప్రారంభమైన రోజు నుండి సెప్టెంబర్ 30 నాటికి 1.2 మిలియన్ల మంది దేశీయ ప్రయాణీకుల రాకపోకలు జరిగాయి.
మే 25న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ సుమారు 40 దేశీయ విమానాల రాకపోకల నుంచి సెప్టెంబర్ నాటికి రోజుకు 230 విమానాల రాకపోకలకు పెరిగింది. విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి సెప్టెంబర్ 30 నాటికి 13,500కు పైగా దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి.
కోవిడ్‌కు పూర్వం హైదరాబాద్ నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, దాదాపు 95% దేశీయ కనెక్టివిటీ పునరుద్ధరించబడి, ఇప్పుడు 52 దేశీయ గమ్యస్థానాలకు విమానాల రాకపోకలు జరగుతున్నాయి. కొత్తగా సెప్టెంబర్ 21 నుండి జబల్పూర్‌కు కూడా విమానసర్వీసులు ప్రారంభంతో మొత్తం 53 గమ్యస్థానాలకు విమానసర్వీసులు నడుస్తున్నాయి.
కోవిడ్ తదనంతర కాలంలో ఎక్కువ సర్వీసులు ఉన్న మొదటి 5 గమ్యస్థానాలు - ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు మరియు ముంబై. ప్రారంభంలో, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఏకదిశలో ట్రాఫిక్ ఉండగా, ఇప్పుడు డిమాండ్ క్రమంగా రెండు మార్గాలలో ఉంది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దేశీయ ట్రాఫిక్‌కు సేవలు అందిస్తున్న టాప్ 3 విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఇండియాగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులు
దేశీయ సర్వీసులతో పాటు, మార్చి 20 నుండి RGIA అంతర్జాతీయ విమానాలను కూడా నిర్వహిస్తోంది; ఇవి వందేభారత్ మిషన్, వివిధ దేశాలలో ప్రారంభించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాల క్రింద అనుమతించబడినవి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ కింద హైదరాబాద్ నుంచి యుకె, యూఏఈ (దుబాయ్, అబు దాబి, షార్జా), ఖతార్, బహ్రెయిన్‌లకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
ఇవి కాకుండా, వివిధ దేశాల నుండి అనేక చార్టర్లు కూడా క్రమం తప్పకుండా హైదరాబాద్‌కు వచ్చిపోతున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెప్టెంబర్ నెలలో ఇలా సగటున 11 అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరిగాయి. ఒకసారి ఇతర దేశాలతో కూడా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాలు కుదిరితే అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ విమాన సర్వీసుల పరంగా, ఏప్రిల్ 20 నుండి సెప్టెంబర్ 30 వరకు RGIA నుంచి 800కు పైగా విమానాల రాకపోకలు జరిగాయి. వివిధ దేశాల నుండి దాదాపు 1.1 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వందే భారత్, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం విమానాలు మరియు చార్టర్లలో హైదరాబాద్‌కు రావడం జరిగింది.
ప్రస్తుత (అక్టోబర్) నెలలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సొంతంగా అభివృద్ధి చేసిన ఇ-బోర్డింగ్ సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంటాక్ట్ లెస్ బోర్డింగ్, పారిశుద్ధ్య చర్యలు
కోవిడ్ సవాలును ఎదుర్కోవటానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం ప్రయాణీకుల ప్రాసెసింగ్ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. విమానాశ్రయంలో ఇప్పటికే దేశీయ విమానాల కోసం ఇ-బోర్డింగ్ ఉండడంతో, విమానాశ్రయం పున:ప్రారంభించిన రోజు నుండి ప్రయాణీకులు కాంటాక్ట్-లెస్ ప్రయాణం చేసేందుకు ఉపయోగపడింది.
విమానాశ్రయం వివిధ కార్యాచరణ ప్రక్రియలను ఆవిష్కరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా బోర్డింగ్ కార్డ్ మరియు సామాను ట్యాగ్‌లను ప్రింట్ చేసే కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ చెకిన్ కియోస్కులు అలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో ఒకటి.
టచ్‌లెస్ టెర్మినల్ ప్రవేశం, సెల్ఫ్-బ్యాగేజ్ డ్రాప్స్, కాంటాక్ట్-లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కాంటాక్ట్-లెస్ వాటర్ ఫౌంటెన్, కాంటాక్ట్-లెస్ ఎలివేటర్లు మా అంతర్గత సాంకేతిక ప్రతిభను ఉపయోగించి రూపొందించిన కొన్ని ఆవిష్కరణలు.
మేం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అంశాలలో పారిశుద్ధ్యం ఒకటి. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించక ముందే విమానాశ్రయంలోని ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసి, ఫ్యూమిగేషన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ రెండింటిలో ట్రాలీల కోసం డిసిన్ఫెక్షన్ టన్నెల్‌లను ఏర్పాటు చేసారు. సెక్యూరిటీ ఫ్రిస్కింగ్ జోన్లలోని ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్(ATRS) కూడా UV టన్నెల్‌తో అనుసంధానించబడి ఉంది. దీని వల్ల భద్రతా తనిఖీకి వెళ్లే ముందు ప్రయాణీకులు తమ బ్యాగేజి ఉంచడానికి పూర్తిగా పరిశుభ్రమైన ట్రేను అందుకుంటారు. అదేవిధంగా ప్రయాణీకుల బ్యాగేజ్ బ్యాగేజ్ బెల్టులు చేరుకున్నప్పుడు సామాను శుభ్రంగా ఉండేలా పూర్తి డిసిన్ఫెక్షన్ ప్రక్రియ జరుగుతుంది.
కార్ పార్క్ వద్ద క్యాబ్ శానిటైజేషన్ వల్ల ప్రయాణీకులు విమానాశ్రయంలో పరిశుభ్రమైన, సురక్షితమైన క్యాబ్‌లను మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. రిటైల్ అవుట్‌లెట్‌లు సహా అన్ని నగదు లావాదేవీ పాయింట్లు ఇప్పుడు డిజిటల్ నగదు రహిత లావాదేవీలకు సిద్ధం చేయబడ్డాయి. అన్ని రిటైల్ అవుట్ లెట్ల వద్ద సామాజిక దూరం ఉండేలా తగిన చర్యలు తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులు చేసేలా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం HOI యాప్‌ను కలిగి ఉంది. ప్రయాణీకులు టెర్మినల్‌లోని HOI App లేదా QR కోడ్‌లను స్కాన్ చేసి మొబైల్ ఫోన్‌ల ద్వారా ఆహారాన్ని ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, విమానాశ్రయంలోని F&B టేక్-అవే, ప్యాక్ చేసిన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో, వన్-టైమ్ యూజ్ కట్లెరీతో అందిస్తున్నారు. విమానాశ్రయం లోపల సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలోని అన్ని రిటైల్ అవుట్లెట్లలో విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడు కొనుగోలు చేసే ప్రతి ఉత్పత్తిని శుభ్రపరచడానికి యువి బాక్స్ ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాము ప్రయాణికుల కోసం తీసుకుంటున్న సురక్షిత చర్యలకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వారి ఎయిర్‌పోర్ట్ హెల్త్ అక్రెడిటేషన్ ను పొందింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం