వైభవోపేతంగా ప్రారంభమైన మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం
- November 01, 2020
సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, మరియు శ్రీ సాంస్కృతిక సారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో తానా, వంగూరి ఫౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సి.పి.బ్రౌన్ తెలుగు సమాఖ్య లండన్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, వేగేశ్న ఫౌండేషన్ వారి సమిష్టి సౌజన్యంతో, కళాప్రపూర్ణ పద్మభూషణ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా 12 గంటల పాటు అంతర్జాలం ద్వారా నిర్విరామంగా నిర్వహింపబడుతున్న "మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం" అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కళాబ్రహ్మ సేవా మహాత్మ వంశీ రామరాజు స్వాగత వచనాలు తో ప్రారంభమైన ఈ సభకు దేవులపల్లి వారి మనుమరాళ్ళు ప్రముఖ కార్టూనిస్ట్ బుజ్జాయి కుమార్తెలు రేవతి అడితం అమెరికా నుండి, రేఖ సుప్రియ చెన్నై నుండి, జ్యోతి ప్రకాశనం గావించి, తమ తాత జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మక మైనది అని అభినందనలు తెలుపి, కృష్ణ శాస్త్రి తో వారికున్న అనుబంధాన్ని గురించి సభాముఖంగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సాహితీవేత్త కె.వి రమణ దేవులపల్లి వారి రచనా వైశిష్ట్యం గూర్చి తెలుపుతూ అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేశారు. భారత దేశం అమెరికా యునైటెడ్ కింగ్డమ్ సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ హాంకాంగ్ స్వీడన్ సౌత్ ఆఫ్రికా తొమ్మిది దేశాలనుండి 58 మంది గాయనీ గాయకులు పాల్గొని దేవులపల్లి వారి రచించిన 100 పాటలతో శతగీతార్చన ప్రారంభించారు.
ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనాగీతం ఆలపించగా రాధిక మంగిపూడి ప్రారంభ సభ నిర్వహించారు. దేవులపల్లి వారి పై వీరుభొట్ల హరి శ్రీనివాస్ విరచిత గీతం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం పాడిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం నేటి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది కృష్ణశాస్త్రి అభిమానులకు వీనులవిందు చేస్తోంది. సాయంత్రం సురేఖ మూర్తి సీతారత్నాకర్ శ్రీమతి విజయలక్ష్మి శశికళ మొదలగు ప్రముఖ గాయనీ మణులు పాటలను ఆలపించనున్నారు. ప్రముఖ రచయిత భువన చంద్ర కి దేవులపల్లి కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ రేలంగి నరసింహారావు వెన్నెలకంటి మొదలగు ప్రముఖులు ప్రసంగించనున్నారు. రాధిక మంగిపూడి సింగపూర్ విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా జయ పీసపాటి హాంకాంగ్ రాధికా నోరి అమెరికా నుండి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారు, శ్రీ సాంస్కృతిక కళాశాల సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం అపురూపమైనటువంటి కార్యక్రమం... ఆలోచనే గొప్పది... అది ఆచరణ సాధ్యమైనట్లుగా చేయడానికి వీలుగా రెండు సంస్థలు ముందుకు రావడం, సారస్వత అభిమానులకందరికి విజయదశమి, దీపావళి కలిపి జరుపుకున్నట్లుగా ఉంది... ‘ఆంధ్ర షెల్లి’ గా, విశ్వకవి రవీంద్రనాద్ గారితో పోల్చబడినటువంటి పెద్దలు, ‘భావ కవితా కోకిల’ దేవులపల్లి కృష్ణ శాస్త్రి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంపు రావడమే గొప్ప తలపోత...
ఈ కార్యక్రమానికి భారత దేశంలోనే కాకుండా సింగపూర్, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్టేలియా ఇలా ఇతర దేశాల నుంచి గాయనీ గాయకులను సమకూర్చుకుని, ఈ కార్యక్రమాన్ని 12 గంటల పాటు నిర్వహించడం, దేవులపల్లివారిపై మనకున్న అభిమానాన్ని తెలియజేయడంగా ఉంది... దేవులపల్లివారి గురించి నేటి తరానికి తెలియచేయాలనే సదుద్దేశంతో వంశీ రామరాజుగారు ఇతర దేశాలలోని తెలుగువారిని సమన్వయపరచుకుని చేయడం, నాలాంటి దేవులపల్లి అభిమానులకు ఆనందంగా ఉంది... ఈ రోజుల్లో మేము పరీక్షల్లో వచ్చేవే చదువుతాము, విదేశాలలో డాలర్లు సంపాదిస్తాము అనుకునే యువతకు దేవులపల్లివారి గురించి తెలియజేయాలని అనుకోవడం బాగుంది...
ఈ కార్యక్రమంలో రాధికా మంగపూడి, వంగూరి చిట్టెన్ రాజు, తాళూరి చంద్ర శేఖర్, తోటకూర ప్రసాద్, జయశీల, విజయకి అలాగే పాల్గొంటున్న ఇతర దేశాలవారికి, మన భారత దేశపు గాయనీ గాయకులకు వందనం... అలాగే వెదవయతీ ప్రభాకర్ కి, చిత్తరంజన్ ప్రభాకర్ కి, వెన్నెలకంటికి, సుద్దాల అశోక్ తేజకి మిగిలిన ఎంతో మందికి పేరు పేరునా, నా వందనాలు... ఇది వంశీ రామరాజు రచనా చుతురత... ఒక్క చోట కార్యక్రమం చేయాటంలోనే ఎంతో కష్టం ఉంటుంది... అలాంటిది ఇంత మందిని ఒకే వేదికపైకి కలిపి, అది కూడా జూమ్ లో కలుపుకుంటూ, నవంబర్ 1 అంటే దేవులపల్లివారి పుట్టినరోజు అని ప్రపంచానికి తెలియజేస్తున్న వంశీ రామరాజుకి, శ్రీ సాంస్కృతిక కళాశాల సంస్థ వారికి నమోవాక్కాలు...
“జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి” లాంటి గీతాన్ని జాతీయ స్థాయిలో అందించిన దేవులపల్లివారిని ఈ రోజు స్మరించుకోవడం మన అదృష్టం... మన తెలుగువారు కాబట్టి ఈ పాటకు జాతీయ స్థాయి గౌరవం రాలేదు అనిపిస్తోంది... ఆయన సాహిత్యం ఎలా ఉంటుందంటే సర్కస్ లో రింగ్ మాష్టర్ పిలవగానే పులులు అన్నీ వచ్చి వరుసగా కూర్చున్నట్లుగా, అక్షరాలు అన్నీ అలా ఆయన ఆధీనంలో ఉండి కవితాసుమాలుగా కూర్చబడ్డాయి... 1950 నుండి 1980 వరకు దాదాపుగా 30 ఏళ్ళు ఆయన పాటలు మాణిక్యాలు... 1951లో మల్లీశ్వరిలో మాటలు, పాటలు ఇప్పటికీ మరిచిపోలేము... ‘మనసున మల్లెలు’ పాట ఇప్పటికీ పాడుకుంటాము... ‘ఇది మల్లెల వేళయనీ’ పాట వైపు అందరూ ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు... ఎంతో మంది పాటలు వ్రాస్తున్నారు... కానీ దేవులపల్లివారిలో ఉన్న లాలిత్యం రాదు... 100 సంవత్సరాల క్రితమే ఆయన హరిజనోద్దరణ కార్యక్రమం చేబట్టారు... ఆయన సాహితీ మిత్రుడే కాదు, సంస్కరణ వీధిలో కూడా మిత్రుడే... మిత్రుడంటే సూర్యుడు... ప్రపంచానికి అర్థమయ్యేలా ప్రపంచంలోని తెలుగు వారందరికీ దేవులపల్లి సాహిత్యం అర్థం అయ్యేలా అపురూపమైన, అద్భుతమయిన కార్యక్రమం చేస్తున్నారు... ఒక జయదేవునిలా, ఒక భవబూతిలా రచించారు... ఆయన గళం మూగపోయినా ఆయన కలం ఆగలేదు... 1963 తరువాత ఆయన గుండె మూగపోయినా ‘రానిక నీ కోసం....’ అంటూ ఒక భగ్న ప్రేమికుడి ఆవేదన ఎంత మధురంగా రాసారో... ఆయన పాటలన్నీ చాలా గొప్పవి... ఆయన దేశ భక్తుడే కాదు, భక్తి పరుడు కూడా, ఎన్నో భక్తి పాటలు రాసారు... అలా వ్రాసిన ‘ఆరనీకుమా ఈ దీపం’ ‘ఘనాఘన సుందరా’ లాంటివి ఇప్పటికీ మన మనసులో నిలచిపోయినాయి...
12 గంటలపాటు నిర్వహించే ఈ సంగీత, సాహిత్య కార్యక్రమం ఒక పుష్ప గుచ్ఛంలాగా, ఒక ఫీస్ట్ లాగా “ఛప్పనార్” ప్రసాదాలతో కూడుకున్న వేంకటేశ్వరస్వామి ప్రసాదం ఎలా ఉంటుందో 58 పాటలతో ఇంత మంది గాయకులను కూడగట్టి చేయటం వీనుల విందుగా, కన్నుల పండువగా ఉంటుంది... ఈ కార్యక్రమలో ఒక మణిలాంటి ‘భువన చంద్ర’ కి పురస్కారం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది... భువన చంద్రకి శుభాకాంక్షలు... ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులకు, పాల్గొంటున్న గాయనీ గాయకులకు నా అభినందనలు... ముఖ్యంగా సమన్వయకర్త వంశీ రామరాజుకి అభినందనలు...
ఈ కార్యక్రమాన్ని దేవులపల్లి కృష్ణ శాస్త్రి వీక్షిస్తూ ఉంటారని, వారి దీవెనలు అందిస్తారని కోరుకుందాం.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు