ఏపీలో స్కూళ్లు ప్రారంభం

- November 02, 2020 , by Maagulf
ఏపీలో స్కూళ్లు ప్రారంభం

ఏపీ:ఏపీలో మళ్లీ బడి గంట మోగాయి. 7 నెలలుగా మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. మొదటగా తొమ్మిది, పదితో పాటు ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. రోజు విడిచి రోజు.. ఒక్క పూట నిర్వహిస్తారు. నవంబర్‌ 23 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు బోధన ప్రారంభం అవుతుంది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక.. డిసెంబర్‌ 14 నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు మొదలు కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసేందుకు సిలబస్‌ రూపకల్పన చేస్తున్నారు. స్కూళ్లకు 180 రోజుల పని దినాలు ఉండనున్నాయి.

స్కూళ్లు తెరవడంతో.. కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు జాగ్రతలు తీసుకోవాలని.. సోషల్‌ డిస్టెన్స్‌, శానిటైజర్‌, మాస్కూలు తప్పనిసరని కేంద్రం కూడా హెచ్చరించింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో తమ పిల్లలను బడికి పంపించలేమంటూ చాలా మంది తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు.. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడలేమంటున్నారు.. వాస్తవానికి కరోనా తగ్గిపోలేదు. ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు 8 లక్షలు దాటాయి. ఇక సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందంటున్నారు. ఇప్పటికే చలి కూడా బాగా పెరిగింది. దీంతో వైరస్‌ విజృంభించేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏమాత్రం లైట్‌ తీసుకున్న మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. మొదట్లో ఎలాంటి జాగ్రత్తలు వహించామో.. అదే జాగ్రత్తలు వహించాలని లేదంటే మళ్లీ ముప్పు తప్పదని హెచ్చరికలు అందుతున్నాయి. ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com