సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్ ను ప్రారంభించనున్న మంత్రి కెటీఆర్

- November 10, 2020 , by Maagulf
సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్ ను ప్రారంభించనున్న మంత్రి కెటీఆర్

హైదరాబాద్‌: కొత్త రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి పోలీసు శాఖను ఆధునీకరించడమే కాకుండా,  పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ’ ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్/ పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ మరియు అండ్ డేటా సెంటర్ ను తెలంగాణ ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి, హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డీజీపీ. ఎం. మహేందర్ రెడ్డి, తదితరులతో కలిసి రేపు (11.11.2020) ప్రారంభించనున్నారు. 

శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం మరియు సమగ్ర అభివృద్ధికి అన్ని అంశాలలో రాష్ట్రాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడం కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్ నిర్మాణం ఉద్దేశం. 

ఈ సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఏర్పాట్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ మహేందెర్ రెడ్డి, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్., అడిషనల్ డిజిపి జితేందర్, డిసిపి శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి, డిసిపి క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఎల్ అండ్ టీ అధికారులతో కలిసి పరిశీలించారు. 

నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌  అందుబాటులోకి రానుంది.కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా భారీ తెరపై ఏకకాలంలో 5,000 కెమెరాల్ని వీక్షించే సదుపాయం సాక్షాత్కరించనుంది. 
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ట్రై కమిషనరేట్ల పరిధిలో ‘సేఫ్‌ సిటీ (సురక్షిత నగరం)’ ప్రాజెక్టు కింద ఏర్పాటవుతున్న సీసీ కెమెరాల దృశ్యాల్ని ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించే వీలుంది. 

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు/ ట్విన్ టవర్లకు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ట్రై కమీషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటయ్యే సిసిటివి లను అనుసంధానం చేయనున్నారు. 

ఎల్ అండ్ టీ సీసీటీవీ లతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌, నేను సైతం ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలగనుంది. 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సేఫ్‌ సిటీ (సురక్షిత నగరం) ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఈ కేంద్రం కీలకం కానుంది. 

ఎల్‌ అండ్‌ టీ సంస్థ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ మూడు కమిషనరేట్లలో 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోంది. దీంతో ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులు పారిపోయే మార్గాల్ని నిశితంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.  

హైలైట్స్..
- వేగంగా వెళ్లే వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్‌ కెమెరాల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. 
- సామాజిక పోలీసింగ్‌లో భాగంగా కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.  
- ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతతో అందుబాటులోకి రాబోతోన్నఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌) ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు. 
- ఏదేని కూడలిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడితే సిబ్బంది ప్రమేయం ఏమీ లేకుండానే సమీప కూడళ్ల నుంచి అటు వైపు వాహనాల్ని రానీయకుండా నియంత్రించి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి రానుంది. 
- ‘నేను సైతం’ ప్రాజెక్టులో భాగంగా వ్యక్తిగతంగా మూడు కమిషనరేట్లలో 10 లక్షల సీసీ కెమెరాల్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 
- ఇలా పలు ప్రాజెక్టుల కింద ఏర్పాటు చేసే లక్షలాది కెమెరాల్ని ఈ కేంద్రం నుంచే వీక్షిస్తారు. భారీ తెరపై ఒకేసారి 5,000 కెమెరాల్ని చూడవచ్చు. అవసరాన్ని బట్టి వీలైనన్ని కెమెరాల్ని జూమ్‌ చేసి దృశ్యాల్ని వీక్షించొచ్చు. 
- ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3 వరుసల్లో వరుసకు 9 చొప్పున టీవీ స్క్రీన్‌లుంటాయి. ఒక్కో టీవీ తెర సామర్థ్యం 70 అంగుళాలు. ఈ భారీ తెర పక్కనే రెండు వైపులా మరో నాలుగేసి టీవీ తెరలు 55 అంగుళాల సామర్థ్యం గలవి ఉంటాయి.
- 20 సీటర్ కెపాసిటీ తో సిసిటివి లను వీక్షించేందుకు సీటింగ్ ఏర్పాటు చేశారు. 
- ఈ కేంద్రంలోనే దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజులపాటు నిక్షిప్తం చేసి ఉంచేలా భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. 
- ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు.

సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ దేశంతో పోలిస్తే 65 శాతం సిసిటివి లు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో 7 లక్షల సిసిటివి లు ఉంటే, సైబరాబాద్ లోనే 1.20 లక్షల సిసిటివి లు ఉన్నాయన్నారు. వీటిల్లో 20 వేల సిసిటివి లను కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా ప్రజలే సమకూర్చుకున్నారు. సిసిటివి ల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కి వెళ్తే దొరికిపోతామనే భయం తో దొంగలున్నారు. సాంకేతికత సాయంతో అనేక కేసులను పోలీసులు ఛేదించారన్నారు. భవిష్యత్తులో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ మరియు అండ్ డేటా సెంటర్ కు డయల్ 100 ను అనుసంధానించనున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com