కువైట్:కోరుకున్న వారికే కోవిడ్ వ్యాక్సిన్..టార్గెట్ వర్గాలకు అధిక ప్రాధాన్యత

- November 20, 2020 , by Maagulf
కువైట్:కోరుకున్న వారికే కోవిడ్ వ్యాక్సిన్..టార్గెట్ వర్గాలకు అధిక ప్రాధాన్యత

కువైట్ సిటీ:కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఎంపిక చేసిన వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని కువైట్ ప్రభత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే..ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో కోరుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం మేర సత్ఫలితాలను ఇచ్చిందని ప్రకటించిన ఫైజర్ కంపెనీతో కువైట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం మేరకు పది లక్షల డోసులు అధిక ప్రధాన్యత కింద ఫైజర్ కంపెనీ కువైట్ కు అందించాల్సి ఉంటుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ నుంచి ఫైజర్ కంపెనీకి తుది అనుమతి రాగానే..కువైట్ కు వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. అయితే పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు వచ్చే అవకాశాలు ఉండటంతో తుది అనుమతి వచ్చేలోగా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి పకడ్బందీ ప్రణాళికతో సిద్ధమవుతోంది కువైట్. ముందుగా ఎంపిక చేసిన వర్గాలకు ప్రధాన్యత ఇవ్వనుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు ముసలివాళ్లు..దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, తప్పనిసరిగా వ్యాక్సిన్ అవసరం ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనుంది. అయితే..ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అప్షన్ మాత్రమేనని..వారికి అభ్యంతరం లేకుంటేనే వ్యాక్సిన్ డోసేజ్ ఉంటుందని కూడా స్పష్టత ఇచ్చింది.

ఇదిలాఉంటే..కువైట్ లో వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగబోయే ఎన్నికలకు తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచించారు. అదే సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోటీలో పాల్గొనే అభ్యర్ధులకు సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలను కూడా విడుదల చేసింది. జడ్జిలు, మీడియా సిబ్బంది, పోలీసులు, అభ్యర్ధులు తమకు కోవిడ్ సోకలేదని పోలింగ్ తేదికి నాలుగు రోజుల ముందే సర్టిఫికెట్ సమర్పించాలని సూచించింది. అయితే...ఓటర్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com