అంతర్జాల మాధ్యమంలో ఘంటసాల ఆరాధనోత్సవాలు

- December 03, 2020 , by Maagulf
అంతర్జాల మాధ్యమంలో ఘంటసాల ఆరాధనోత్సవాలు

స్వాతంత్య్ర సమరయోధులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత, అమరగాయకులు, సద్గురు ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి డిసెంబర్‌ 4, 5 తేదీలలో అంతర్జాల మాధ్యమంలో ఘనంగా జరగబోతున్నది. రెండవ ప్రపంచ సంగీత, సాహిత్య సమ్మేళనోత్సవంలో భాగంగా అమరగాయకునికి ఘననివాళి అర్పించనున్నారు. 17వ అంతర్జాతీయ సంస్థలు, తానా, ఆటా, నాట్స్‌, నాటా, తెలంగాణా అమెరికా తెలుగు సంఘం, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి డాట్‌కామ్‌ ఆస్ట్రేలియా, టాయ్‌ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ తెలుగు అసోసియేషన్‌, తెలుగు అసోసియేషన్‌ సిడ్నీ, తెలుగువాహిని మాసపత్రిక సిడ్నీ, హాంగ్‌కాంగ్‌ తెలుగు సమాఖ్య, మలేషియా తెలుగు సంఘం, తెలుగు సాంస్కృతిక నిలయం, మార్షియస్‌, వంశీ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ అమెరికావారి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఇండియా, వంశీ ఇంటర్నేషనల్‌ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌, గోల్డెన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ విజయనగరం, శారదా కళాసమితి ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా అద్వితీయంగా జరగబోయే 2 రోజుల కార్యక్రమాన్ని మొదటి రోజు ఘంటసాలగారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌, రెండవరోజు ఘంటసాలగారి మనుమరాలు వాణి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభిస్తారు. ముఖ్యఅతిథులుగా ప్రజానటి, కళాభారతి, పార్లమెంటు మాజీ సభ్యురాలు డా॥ జమునా రమణారావు, మాజీ ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా॥ కె.వి. రమణ, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి కోటి, మాధవపెద్ది సురేష్‌, ప్రముఖ నేపథ్యగాయని జమునారాణి, ప్రముఖ సినీదర్శకులు రేలంగి నరసింహారావు, డా॥ ప్రసాద్‌ తోటకూర, ఫౌండర్‌ ఎఎన్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ పాల్గొననున్నారు. డిసెంబర్‌ 4వ తేదీన సద్గురు ఘంటసాల జయంతి సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసులు పట్రాయని సంగీతరావుకు ఘంటసాల వంశీ జాతీయ సంగీత పురస్కారం మరియు 50,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి సంగీత గురువులు, ప్రముఖ గాయకులచే ఘంటసాల గానలహరి కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది.

డిసెంబర్‌ 5వ తేదీన 5 ఖండాలలోని 9 దేశాలనుంచి 160 మంది చిన్నారులు, యువతీ యువకులు 12 గంటలపాటు ఘంటసాల పాటలతో ఘంటసాల పాటకు పట్టాభిషేకం చేయనున్నారు. మొత్తం 185 పాటల ఆలాపనతో ఘంటసాల అభిమానులను అబ్బురపరిచే ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌లో నమోదు కాబోతున్నది.
ఘంటసాలగారి సతీమణి ఘంటసాల సావిత్రమ్మ ఆశీస్సులతో కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి డా॥ వంశీ రామరాజు, డా॥ కె.వి. రావు, వైస్‌ చైర్మన్‌ గిఫ్ట్‌; రాధికా మంగిపూడి, అధ్యక్షురాలు ది గోల్డెన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ విజయనగరం; రత్నకుమార్‌ కవుటూరు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌, డోగిపర్తి శంకరరావు, అధ్యక్షులు శారదా కళాసమితి; సురేఖామూర్తి దివాకర్ల, కార్యక్రమ సమన్వయకర్త; డా॥ తెన్నేటి సుధాదేవి అధ్యక్షురాలు వంశీ; శైలజ సుంకరపల్లి, మేనేజింగ్‌ ట్రస్టీ వంశీ నిర్వహించనున్నారు.
ప్రధాన గాయనీగాయకులుగా డా॥ అమలాపురం కన్నారావు, జి.వి. ప్రభాకర్‌ (అమెరికా), సురేఖామూర్తి దివాకర్ల, విజయలక్ష్మి (భువనగిరి), కీర్తికా మంగు (దక్షిణాఫ్రికా), శరత్‌బాబు కాజా పాడనున్నారు. ప్రధానపాత్ర వహిస్తున్న గురువులు కొమాండూరి రామాచారి, వేదాల శశికళాస్వామి, నేమాని పార్థసారథి, హోసూరు హైమవతి, వి.కె. దుర్గ, డా॥ ద్వారం వి.కె.జి. త్యాగరాజు, తిరుమల శ్రీనిధి, వారణాసి శ్రీసౌమ్య, చాగంటి రాజ్యలక్ష్మి, కె. ప్రతాప్‌ విద్యాసాగర్‌, డా॥ పద్మ మల్లెల (న్యూజిలాండ్‌), దేవేంద్రం కృతిక (ఆస్ట్రేలియా), కాపవరపు విద్యాధరి (సింగపూర్‌), యడవల్లి శేషుకుమారి (సింగపూర్‌), సిహెచ్‌. షర్మిల (సింగపూర్‌), పాచంటి హర్షిణి (హాంగ్‌కాంగ్‌), కనకమామి (హాంగ్‌కాంగ్‌), మల్లుల సత్యాదేవి (మలేషియా) పాల్గొననున్న ఈ కార్యక్రమంలో వీణావాదన ద్వారా ప్రార్థనాగీతాన్ని వేదుల శేషాద్రి (సింగపూర్‌) సమర్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com