GHMC మేయర్ రేసులో పలువురు మహిళా నేతలు

- December 06, 2020 , by Maagulf
GHMC మేయర్ రేసులో పలువురు మహిళా నేతలు

హైదరాబాద్:GHMC ఎన్నికల ఫలితాల్లో ఊహించని మెజార్టీ రాకపోయినా.. అతి పెద్ద పార్టీగా అవతరించింది అధికార టీఆర్‌ఎస్‌. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ కైవసం చేసుకునే దిశగా కసరత్తు మొదలెట్టింది కారు పార్టీ. ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంటామని గులాబీ దళం ధీమాగా ఉంది. ఈసారి GHMC మేయర్ సీటు జనరల్‌ మహిళలకు రిజర్వు కావడంతో చాలా మంది అభ్యర్థులు మేయర్ రేసులో ఉన్నారు. టిఆర్ఎస్ తరఫున 27 మంది మహిళా కార్పొరేటర్లు గెలిచారు వారిలో రెండోసారి గెలిచిన మహిళా కార్పొరేటర్లు ముందు రేసులో ఉన్నారు.

ఖైరతాబాద్ నుంచి గెలిచిన పీజేఆర్ కూతురు విజయ రెడ్డి.. వెంకటేశ్వర కాలనీ నుంచి గెలిచిన కవితా రెడ్డి.. బంజారాహిల్స్ నుంచి గెలుపొందిన కేకే కూతురు విజయలక్ష్మి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి భారతి నగర్ కార్పొరేటర్‌గా గెలిచిన సింధు ఆదర్శ్ రెడ్డి అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి మేయర్ రేసులో ఉన్నారు. ఒకవేళ మేయర్ అగ్రవర్ణాలకు ఇస్తే డిప్యూటీ మేయర్ పదవిని ఎస్సీ బీసీ మైనార్టీల్లో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి.. ఏం చేయాలి అన్నదారిపై గెలుపొందిన కార్పొరేటర్లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. అయితే ఎం.ఐ.ఎం కూడా తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు తాము ఏ పార్టీతో చర్చించలేదన్నారు ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. మేయర్‌ ఎన్నికపై ఎవరైనా తనను సంప్రదిస్తే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గెలుపొందిన తమ పార్టీ కార్పొరేటర్లను ఆయన అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com