ఏలూరు ను కబళిస్తున్న వింత వ్యాధి..రేపు కేంద్ర డాక్టర్ల బృందం పర్యటన

- December 07, 2020 , by Maagulf
ఏలూరు ను కబళిస్తున్న వింత వ్యాధి..రేపు కేంద్ర డాక్టర్ల బృందం పర్యటన

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి బారిన పడిన బాదితుల సంఖ్య 400 దాటేసింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రితో పాటు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఏలూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వీరి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపినా ఫలితం తేలలేదు. దీంతో ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌కు వీరి శాంపిల్స్‌ పంపారు.

ఏలూరులో వింత వ్యాధి మరింత మందికి వ్యాపిస్తున్న నేపథ్యంలో రేపు నగరానికి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా ఏలూరు బయలుదేరి వెళ్లాలని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ముగ్గురు వైద్య నిపుణులకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి సమాచారం వెళ్లింది. వీరిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జంషెడ్‌ నాయర్‌, పూణేకు చెందిన వైరాలజిస్ట్‌ అవినాష్‌ దియోష్టవర్‌, ఎన్‌సీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ సంకేత్‌ కులకర్ణి రేపు ఏలూరు రానున్నారు.

రేపు ఉదయం ఏలూరు చేరుకోనున్న కేంద్ర ప్రభుత్వ డాక్టర్ల బృందం ముందుగా రోగులను పరిశీలించనున్నారు. స్ధానిక ప్రభుత్వ డాక్టర్లతో సమావేశమై రోగ లక్షణాలతో పాటు ఇతర వివరాలు తెలుసుకుంటారు. రేపు సాయంత్రం కల్లా ప్రాధమిక నివేదిక అందించాలని కేంద్ర

ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి వీరికి ఆదేశాలు అందాయి. ఇప్పటివరకూ గుర్తించని లక్షణాలతో జనం భారీ స్ధాయిలో ఎందుకు ఆస్పత్రుల పాలవుతున్నారన్న దానిపై ఈ బృందం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి నిత్యం ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ ఏలూరులో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com