దివ్యాంగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొండంత అండ

- December 07, 2020 , by Maagulf
దివ్యాంగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొండంత అండ

హైదరాబాద్:దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత సోమవారం  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి,దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వివరించారు.

హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో మహిళా,శిశు,దివ్యాంగుల సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి దివ్యారాణి,దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.

దివ్యాంగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన అంశాలను కవిత మంత్రికి వివరించారు.వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణమే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు 3,016 రూపాయల చొప్పున  4,98,565 మంది దివ్యాంగులకు అందజేస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.అదేవిధంగా అవసరమైన వారికి ట్రై సైకిళ్లు, వీల్ ఛైర్లు, ల్యాప్ టాప్స్, హియరింగ్ హెడ్స్, బ్రెయిలీ లిపితో ఉన్న పుస్తకాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు దివ్యాంగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు ‌కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కొప్పుల చెప్పారు.దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లు,సంబంధిత చట్టాలు, జీవోల అమలు గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేలా చూస్తానని కవితకు మంత్రి హామీనిచ్చారు.

సమావేశంలో దివ్యాంగుల సంఘాల నాయకులు ఎం.శ్రీనివాసులు,హాబీబ్ మియా,బి.మహేందర్,డి.మహేష్, లక్ష్మీ నారాయణ,నారా నాగేశ్వరరావు,పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com