తస్మాత్ జాగ్రత్త...అలర్జీ ఉంటే ఫైజర్ టీకా వద్దు

- December 10, 2020 , by Maagulf
తస్మాత్ జాగ్రత్త...అలర్జీ ఉంటే ఫైజర్ టీకా వద్దు

అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ టీకాను బ్రిటన్‌లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 90 ఏళ్ల బామ్మకు రెండు రోజుల క్రితమే ఆ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే తాజాగా బ్రిటన్ వైద్య నియంత్రణా అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన అలర్జీ సమస్య ఉన్న వాళ్లు ఫైజర్ టీకాను తీసుకోరాదన్నారు. మెడిసిన్ వేసుకుంటే అలర్జీ వచ్చినా.. లేదంటే ఏదైనా ఆహారం పడకున్నా వచ్చే అలర్జీ లక్షణాలు ఉంటే.. అలాంటి వాళ్లు ఆ టీకాను తీసుకోరాదు అని బ్రిటన్ తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. మంగళవారమే బ్రిటన్‌లో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అలర్జీ(అనాఫైలాక్సిస్) కేసులు రెండు నమోదు అయినట్లు మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. కరోనా వైరస్ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఈ కేసులు నమోదు అయినట్లు ఆ ఏజెన్సీ వెల్లడించింది.

ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రెయిన్ ఈ నేపథ్యంలో ఓ ప్రకటన జారీ చేశారు. అలర్జీ లక్షణాలు ఉన్న వాళ్లు ఫైజర్‌-బయోఎన్‌టెక్ టీకాను వేసుకోవద్దు అంటూ ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి ఈ టీకా తీసుకున్నవారిలో ఎక్కువ శాతం మందికి ఎటువంటి అలర్జీ రియాక్షన్లు ఉండవని, ఇది కోవిడ్‌19 నుంచి రక్షణ ఇస్తుందని, ఎంహెచ్ఆర్ఏ సురక్షిత ప్రమాణాలకు తగినట్లు వ్యాక్సిన్ ఉందని ఆయన అన్నారు. ఎంహెచ్ఆర్ఏ చేపడుతున్న విచారణకు మద్దతు ఇస్తున్నట్లు ఫైజర్‌, బయోఎన్‌టెక్ సంస్థలు ప్రకటించాయి. ఫైజర్ సంస్థ రూపొందించిన కరోనా టీకాకు బ్రిటన్ ఆమోదం తెలుపగా.. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ, యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మాత్రం ఇంకా ఆ కంపెనీ డేటాను పరిశీలిస్తున్నాయి. అలర్జీ ఉన్నవాళ్లకు ఇప్పట్లో ఫైజర్ టీకాను ఇచ్చే అవకాశాలు లేవని అమెరికా అధికారులు కూడా స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com