సౌదీ ప్రిన్స్ ప్రకటన మేర భారత్ లో సిద్ధమవుతున్న ప్రణాళికలు

- December 21, 2020 , by Maagulf
సౌదీ ప్రిన్స్ ప్రకటన మేర భారత్ లో సిద్ధమవుతున్న ప్రణాళికలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలన్న తమ నిర్ణయం మేరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సౌదీ అరేబియా వెల్లడించింది. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావం నుంచి భారత్‌ అత్యంత త్వరగా కోలుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్రో కెమికల్స్‌-శుద్ధి, మౌలిక వసతులు, మైనింగ్‌, ఉత్పత్తి, వ్యవసాయం వంటి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఆ దేశ రాయబారి డాక్టర్‌ సౌద్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ సతి మాట్లాడుతూ.. పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమకు వ్యూహాత్మకంగా భారత్‌ కీలక దేశమని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న మైత్రిని భవిష్యత్తుల్లో మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకాల్ని అల్‌ సతి అభినందించారు. రెండు దేశాలు ఆర్థికంగా కోలుకున్న కొద్దీ ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు సైతం లబ్ధి పొందుతాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు ద్వారా రక్షణ, భద్రత, ఉగ్రవాద నిర్మూలన, పునరుత్పాదక ఇంధన వనరుల వంటి అంశాల్లో సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరోక్షంగా గతవారం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే సౌదీ పర్యటననూ గుర్తుచేశారు.

ఇక వాణిజ్యపరంగా.. సౌదీ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(పీఐఎఫ్‌) నుంచి రిలయన్స్‌ రిటైల్‌లో 1.3 బిలియన్‌ డాలర్లు, జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని ఈ సందర్భంగా అల్‌ సతి గుర్తు చేశారు. అలాగే భారత ఇంధన రంగంలో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. వీటితో పాటు మరిన్ని కొత్త అవకాశాల కోసం శోధిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత కార్మికులు అత్యధికంగా వలస వెళ్లే అరబ్‌ దేశాల్లో సౌదీ ఒకటి అయిన నేపథ్యంలో ఇటీవల తీసుకొచ్చిన కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రస్తావించారు. దీంతో ఉద్యోగులు, సంస్థల మధ్య బలమైన ఒప్పంద సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com