స్వదేశీ కరోనా టీకా గురించి ఉపరాష్ట్రపతికి వివరించిన భారత్ బయోటెక్
- December 25, 2020
హైదరాబాద్:కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారవుతున్న కరోనా టీకాకు సంబంధించిన అంశాలను భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా.. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కి వివరించారు. శుక్రవారం డాక్టర్ కృష్ణతోపాటు సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా, వారి కుటుంబసభ్యులు ఉపరాష్ట్రపతిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తోకలిసి భారత్ బయోటెక్ సంస్థ సంయుక్తంగా రూపొందిస్తున్న టీకా తయారీ, వివిధ దశల ప్రయోగాలు, తాజా పరిస్థితి సహా, మన ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం తదితర విషయాలను వారు ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఇప్పటికే కరోనా టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని.. మూడోదశ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని ఉపరాష్ట్రపతికి తెలిపారు. రెండు దశల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. టీకా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని డాక్టర్ కృష్ణ తెలిపారు. ఒకసారి కరోనాకు గురైన వారు కూడా టీకాను తీసుకుంటే మంచిదని ఆయన పేర్కొన్నారు. టీకా పంపిణీ వ్యవస్థ బలంగానే ఉందని అందువల్ల లైసెన్స్ వచ్చిన తర్వాత టీకా పంపిణీ పెద్ద సమస్య కాబోదని డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు.
ఇన్ఫ్లుయెంజా (హెచ్1ఎన్1), రోటావైరస్, మెదడువాపు వ్యాధి, రేబీస్, చికున్ గన్యా, జికా వైరస్, టైఫాయిడ్ వంటి వ్యాధులకు టీకాలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే.. మన శాస్త్రవేత్తలు గొప్ప విజయాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ బయోటెక్ కు మంచి నేపథ్యం ఉందని.. గతంలో రూపొందించిన 16 రకాలైన టీకాలు, 4 జీవ చికిత్స (బయో థెరప్యుటిక్) రిజిస్ట్రేషన్లను ప్రస్తావిస్తూ.. ప్రపంచస్థాయి పరిశోధన, ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్న యాజమాన్యాన్ని, ఈ సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
2015లో రోటావాక్ విడుదల సందర్భంగా ప్రధాని నివాసంలో జరిగిన కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో రోటావైరస్ వైరస్ పంపిణీ సత్ఫలితాలను ఇస్తున్నందున.. ప్రస్తుత కరోనా టీకా విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రంలో ఈ స్వదేశీ కరోనా టీకా (కోవాక్సిన్) రూపొందుతుండటం, ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం 70 దేశాల రాయబారులు కూడా ఈ కేంద్రాన్ని సందర్శించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష