వరంగల్ ఎన్నికలు షెడ్యూల్
- February 21, 2016
గ్రేటర్' ఎన్నికలకు శ్రీకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మార్చి 6న పోలింగ్.. 9న ఫలితాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ హన్మకొండ : వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గ్రేటర్ వరంగల్‌గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా ప్రజాప్రతినిధులు కొలువుదీరబోతున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయగా.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్‌ను నగర కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 58 డివిజన్లకు ఎన్నికలు జరగుతాయన్నారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని, మార్చి 6న పోలింగ్ నిర్వహించి, 9న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం నుంచి ఈనెల 24 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఇందుకోసం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి నాలుగు డివిజన్లకు ఓ రిటర్నింగ్ అధికారిని, ఇద్దరు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు డిపాజిట్‌గా రూ. 2,500, జనరల్ అభ్యర్థులు రూ. 5,000 చెల్లించాలన్నారు. ఫిబ్రవరి 25న నామినేషన్లు పరిశీలిస్తామని, 26న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అదేరోజు సాయంత్రం వెల్లడిస్తామన్నారు.మార్చి 6న పోలింగ్.. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో మొత్తం 653 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగిస్తామని కమిషనర్ తెలిపారు. మార్చి 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మార్చి 8న రీ పోలింగ్ నిర్వహించి, 9న ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 408 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, గ్రేటర్‌ను 58 డివిజన్లుగా విభజించామని చెప్పారు. ఇందులో మొత్తం 6,01,840 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 3,02, 573 మంది, మహిళలు 2,99,267 మంది ఉన్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









