కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ సెంటర్ ను పరిశీలించిన టి.గవర్నర్

- January 02, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ సెంటర్ ను పరిశీలించిన టి.గవర్నర్

హైదరాబాద్:గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు తిలక్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ తీరును స్వయంగా పరిశీలించారు. 

గవర్నర్, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజి నిపుణులు డా. పి. సౌందరరాజన్ తో కలసి తిలక్ నగర్ పి.హెచ్.సి లో డ్రైరన్ జరుగుతున్న తీరును పరిశీలించారు.కొన్ని సర్వేలలో చెబుతున్నట్లు 40 శాతం మంది హెల్త్ వర్కర్లు వ్యాక్సీన్ తీసుకోవడానికి సుముఖంగా లేరు అన్నది సరికాదని గవర్నర్ అన్నారు.వ్యాక్సిన్ అత్యంత సురక్షితం, ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ విపరీత దుష్పరిణామాలు ఏవీ నమోదుకాలేదు అని అన్నారు.తిలక్ నగర్ పి.హెచ్.సి లో వైద్య సిబ్బందితో, వ్యాక్సీన్ తీసుకుంటున్న వారితో మాట్లాడి వారిలో గవర్నర్ కొత్త ఉత్సాహాన్ని నింపారు. వారందరికీ గవర్నర్ స్వయంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అభినందనల గ్రీటింగ్ కార్డులను అందజేశారు. గవర్నర్ సమక్షంలోనే కొందరు హెల్త్ వర్కర్లకు వ్యాక్సీన్ వేశారు. కోల్డ్ చెయిన్ సిస్టం, వ్యాక్సీన్ వేసే పద్ధతి, వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత అరగంటపాటు వారిని అబ్జర్వేషన్ లో ఉంచే విధానం మొత్తాన్ని గవర్నర్ పరిశీలించారు. ప్రతీ ఒక్క వైద్య సిబ్బందిని పలకరించారు, అభినందించారు. 

నాలుగు దశల్లో వ్యాక్సినేషన్:   రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మందికి నాలుగు దశల్లో వ్యాక్సీన్ ఇస్తారు. మొదటి దశలో ఐదు లక్షల మందికి ఇస్తారని గవర్నర్ తెలియజేశారు. 
డ్రైరన్ ద్వారా వ్యాక్సీన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను గమనించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలుత వ్యాక్సీన్ అందజేస్తారు. యాభై సంవత్సరాలు దాటిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 సంవత్సరాల లోపు వారికి తర్వాతి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సీన్ వేస్తారు. 

ఈ సందర్భంగా కోవిడ్ సంక్షోభ సమయంలో నిస్వార్ధ సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సెల్యూట్ చేస్తున్నానని గవర్నర్ అన్నారు. భారత సైంటిస్టుల కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీలో గొప్ప కృషి చేశారు. వారిపట్ల భారత్ చాలా గర్వంగా ఉందన్నారు.భారతదేశం ప్రపంచానికి వ్యాక్సీన్ పంపిణీలో ముందుంచడంలో ఉంచిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితోనే ఈ కృషి సాగింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి చేసిన ఏర్వాట్లు బాగున్నాయని అభినందించారు.గడిచిన 2020 వ సంవత్సరం పాండెమిక్ సంవత్సరమని, ఐతే ఈ 2021 ప్రొటెక్షన్ సంవత్సరమని గవర్నర్ అభివర్ణించారు. 

మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టక్ డా. జి. శ్రీనివాసరావు డ్రైరన్ తీరును, వ్యాక్సినేషన్ ఏర్పాట్లను గవర్నర్ కు వివరించారు. గవర్నర్ డ్రైరన్ సెంటర్ ను స్వయంగా సందర్శించడం తమలో కొత్త స్ఫూర్తి నింపిందని ఆయన అన్నారు.గవర్నర్ స్వయంగా తాము కూర్చున వద్దకు వచ్చి పలకరించడంతో వైద్య సిబ్బంది, నర్సులు, ఆయాలు సంతోషంతో ఉద్వేగానికి గురైనారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com