కోల్‌కతాలో 'టగ్‌ ఆఫ్ వార్‌'గా పరాక్రమ దివస్

కోల్‌కతాలో \'టగ్‌ ఆఫ్ వార్‌\'గా పరాక్రమ దివస్

కోల్‌కతా:నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి కేంద్రానికి, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య 'టగ్‌ ఆఫ్‌ వార్‌'గా మారింది. కొద్దినెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో నేతాజీ జయంతి సందర్భంగా లబ్ధిపొందేందుకు ఇరు పక్షాలు ప్రయత్నించాయి. నేతాజీ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్‌ను పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కోల్‌కతా నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం కూడా 'దేశ్‌ నాయక్‌ దివస్‌' పేరుతో పలు కార్యక్రమాలను చేపట్టింది.
కోల్‌కతాలో నేతాజీకి అంకితం చేసిన శాశ్వత మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభించారు. కోల్‌కతా విక్టోరియా మెమోరియల్‌ కార్యక్రమ వేదికపై ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగించేందుకు లేవగానే బిజెపి కార్యకర్తలు 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ కార్యక్రమం హుందాగా ఉండాలని భావిస్తున్నాను. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ప్రధాన మంత్రి, సాంస్కృతిక మంత్రిత్వశాఖ కోల్‌కతాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఒకరిని ఆహ్వానించిన తరువాత వారిని అవమానించడం సరికాదు. నిరసనగా, నేనేమీ మాట్లాడను. జై హింద్‌, జై బంగ్లా' అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.
మరోవైపు మమతాబెనర్జీ శ్యామ్‌బజార్‌లోని నేతాజీ విగ్రహం నుంచి ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించకూడదనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కొత్త పార్లమెంటును నిర్మిస్తున్నారని, కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నారని, నేతాజీకి ఎందుకు మెమోరియల్‌ ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. పరాక్రమ దివస్‌ సందర్భంగా ఇక్కడి ప్రజల మధ్య వుండడం తనకెంతో గౌరవమని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. నేతాజీ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గన్నారు.


ఎలిగన్‌ రోడ్‌లోని నేతాజీ పూర్వీకుల ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రి పరాక్రమ దివస్‌ను కేంద్రం పాటించడంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. హిందీ, బెంగాలీ లేదా ఇంగ్లీషు పదం ఏదైనా అయివుండవచ్చు కానీ పరాక్రమ్‌ అంటే అర్థం కాలేదని మమత వ్యాఖ్యానించారు. నేతాజీ అంటే జాతీయ యోధుడని అందుకే దేశీ నాయక్‌ దివస్‌గా పాటిస్తున్నామని చెప్పారు. రవీంద్రనాథ్‌ ఠాగూరే ఆయనకు ఈ బిరుదును ఇచ్చారని గుర్తు చేశారు. తమకు నేతాజీ ఎన్నికల ముందే గుర్తుకు రారని, 365రోజులూ గుర్తుంటారని వ్యాఖ్యానించారు. నేతాజీ మనవడు, హార్వర్డ్‌ చరిత్రకారుడు సుగతా బోస్‌ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Back to Top