అరకు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురి దిగ్భ్రాంతి

- February 13, 2021 , by Maagulf
అరకు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురి దిగ్భ్రాంతి

విశాఖపట్టణం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.అరకు రోడ్డు ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందని,మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థిస్తున్నట్టు ఆయన కార్యాలయం తెలుగులో ట్వీట్ చేసింది.

అరకు ఘటనపై ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే, ఈ ప్రమాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కెసిఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాసు, ఎస్పీ కృష్ణతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు.

మరోపక్క, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు కెటిఆర్‌ హరీశ్‌రావు, మహమూద్‌ అలీ ప్రమాదం విషయం తెలిసి విచారం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com