న్యూజిలాండ్ : వాళ్లందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్
- February 19, 2021
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే న్యూజిలాండ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ జూన్ నుంచి దేశంలోని అన్ని పాఠశాలల్లో శానిటరీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గురువారం ప్రకటించారు. శానిటరీ కిట్లను కొనేందుకు ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పథకంతో దేశంలో పీరియడ్ పావర్టీని నిర్మూలించేందుకు అడుగు పడిందని జసిండా తెలిపారు. దీనికి సంబంధించి గత ఏడాది ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. అప్పట్లో 15 పాఠశాలల్లో 3,200 మంది విద్యార్థిణులకు శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా అందించారు. ప్రస్తుతం పథకాన్ని దశల వారీగా అన్ని స్కూళ్లకు విస్తరించనున్నారు. దీనివల్ల హాజరు శాతం కూడా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్‌లోని ప్రతి 12మంది విద్యార్థిణుల్లో ఒకరు పిరియడ్స్ సమయంలో స్కూల్‌కు రావట్లేదని ఒక అధ్యయనంలో తేలింది. ఇళ్లవద్ద వారు పరిశుభ్రత పరంగా సరైన చర్యలు తీసుకోవట్లేదు. దీంతో పాటు శానిటరీ ప్యాడ్స్ కోసం చేయాల్సిన ఖర్చులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాన్ని ప్రారంభించామని జెసిండా వివరించారు. ఈ కార్యక్రమం కోసం రానున్న మూడేళ్లలో 25 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేశ మహిళా శాఖ మంత్రి జాన్ టినెట్టీ చెప్పారు. హై స్కూల్ విద్యార్థిణులందరికీ పీరియడ్స్ ట్రాకింగ్, ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, అపోహలు, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ 2017లో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఆ దేశ ప్రధానిగా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సాధించారు. మహిళల హక్కులు, సంక్షేమానికి జసిండా మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీకి తన మూడు నెలల చిన్నారితో కలిసి వెళ్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించి, రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష