వైరస్ వ్యాప్తిపై బహ్రెయిన్ ఆందోళన..అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

- February 21, 2021 , by Maagulf
వైరస్ వ్యాప్తిపై బహ్రెయిన్ ఆందోళన..అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

మనామా:కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుండటం పట్ల గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం స్పష్టం కనిపించటంతో...తమ దేశంలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మళ్లీ లాక్ డౌన్ నాటి రోజుల వైపు పయనిస్తున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. పార్టీలు, హోటళ్లు, ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, ప్రయాణాలు ఇలా అన్నింటిపై పరిమితులు విధిస్తున్నాయి. ఇక కువైట్ అయితే..ఏకంగా కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. అటు బహ్రెయిన్ కూడా వ్యాప్తి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ వచ్చినా ప్రజలు మాత్రం వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజా భద్రతా, శిక్షణ వ్యవహారాల ముఖ్య సహాయాధికారి షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య శాఖ సూచించిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పరిస్థితులు నానాటికి ఆందోళన కలిగిస్తున్నాయని..ఈ పరిస్థితుల్లో అవసరం అనుకుంటే తప్ప బయటికి రాకపోవటమే మంచిదని ఆయన అన్నారు. బంధువులు, స్నేహితులు కూడా ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లకపోవటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఒకవేల బయటికి వెళ్లాల్సి వస్తే ఫేస్ మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com