నాలో నేను

- February 26, 2016 , by Maagulf

 

నాకు చాలా సంతోషంగా ఉంది

నా దేశాన్ని గురించి ఎందరో

దేశ భక్తి గీతాలు పాడారు

రాజ్యాంగాన్ని రచించి

అందరూ సమానమని

ఎలుగెత్తి చాటారు

భిన్నత్వంలో ఏకత్వమని

సందేశాన్ని పంచారు

 

నిండా ఇరవై కూడా లేని నాకు

నా దేశం ఇంకోలా కనిపిస్తోంది

ప్రతి దేశానికీ ఒక భాష ఉంది

నా దేశానికి అమ్మ భాష లేకుండా పోయింది

ప్రతి దేశానికీ ఒక మతముంది

నా దేశానికి ఏ మతమూ లేకుండా పోయింది

పైపెచ్చు ఆ మతం పేరిట

మారణ హోమం జరుగుతోంది

ఉగ్రవాదులకు ఈ మతమే

ఇప్పుడు వజ్రాయుధంలా మారింది

 

ఒక్క మతంలో కూడా

అనేకానేక కులాలు

ఆ కులాలలో ఎన్నో ఎన్నెన్నో శాఖలు

కులం పేరిట రిజర్వేషన్లు

ఆ రిజర్వేషన్ల పేరున కుమ్ములాటలు

దోపిడీలు దహనాలూ

హత్యాకాండలూ కుతంత్రాలూ

చదువు ఖరీదయిపోయింది

చదివాక డిగ్రీకి కూడా విలువ లేకుండాపోయింది

 

డబ్బుకున్న విలువ

మనిషికి లేదు

ఆ డబ్బు ఎలా వచ్చినా మనకక్కర్లేదు

డబ్బు మనిషినే కాదు

ప్రపంచాన్ని కూడా శాసిస్తోంది

ప్రజాస్వామ్యం ఇక్కడ ఖూనీ అయింది

అయినా భావి భారత పౌరుడిగా

నేను జబ్బలు చరుచుకుంటాను

 

కాగితాల మీద నా దేశం

చాలా గొప్పది

అందుకే నాకు సంతోషం

ఇలాంటి సంస్కృతికి

నేను వారసుడిగా నిలబడినందుకు

 

                                    ---- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com