భారత్ లో వ్యాక్సిన్: సాధారణ ప్రజలకూ వ్యాక్సినేషన్​.. అర్హత, దరఖాస్తు విధానం

- March 09, 2021 , by Maagulf
భారత్ లో వ్యాక్సిన్: సాధారణ ప్రజలకూ వ్యాక్సినేషన్​.. అర్హత, దరఖాస్తు విధానం

ఏడాది కాలం నుంచి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తోన్న కరోనా వైరస్​కు విరుగుడైన వ్యాక్సిన్​ ప్రక్రియ దేశవ్యాప్తంగా వేగవంతంగా సాగుతుంది. తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు వ్యాక్సిన్​ అందించారు. ఇక ఇవాల్టి నుంచి రెండో విడత వ్యాక్సిన్​ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడతలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్​ అందించనున్నారు. ప్రస్తుతం, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లకు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్​ అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్​ ఆసుపత్రుల్లో కూడా ఈ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్​ అందుబాటులో ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం దీనికి రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వ్యాక్సిన్​ తీసుకునే ముందు కోవిన్​ డిజిటల్ ప్లాట్​ఫామ్​లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్​ డ్రైవ్​లో పాల్గొనేందుకు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, అర్హత వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కోవిన్​ యాప్​ ద్వారా..
CoWIN యాప్ లేదా cowin.gov.in వెబ్​సైట్​ ద్వారా వ్యాక్సిన్​ డ్రైవ్​కు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ కొరకు మీ మొబైల్ నంబర్ తో పాటు ఆధార్ నంబర్ లేదా మరేదైనా ప్రభుత్వ గుర్తింపు నంబర్ ఇవ్వాలి. కో-విన్ 2.0 యాప్​ GPS- ఇంటిగ్రేటెడ్ యాప్​. ఇది మన మొబైల్ లొకేషన్​ ఆధారంగా సమీప వ్యాక్సిన్​ కేంద్రాలను చూపిస్తుంది. మన సౌలభ్యం ప్రకారం వ్యాక్సిన్​ కేంద్రాన్ని, సమయం స్లాట్‌ను ఎంచుకోవచ్చు. మీకు స్లాట్​ బుక్​ అయిన రోజు, ఆ సమయానికి నేరుగా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్​ వేయించుకోవచ్చు. అయితే, ఇలా ఆన్​లైన్​ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారికి 40 శాతం, వాక్‌-ఇన్‌ల ద్వారా వచ్చిన వారికి 60 శాతం వ్యాక్సిన్​ కేటాయించాలని వ్యాక్సిన్​ సెంటర్లకు ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్ఎస్) కింద ఎంపానెల్ చేయబడిన ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే ఈ వ్యాక్సిన్​ డ్రైవ్​లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు, 1.7 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 28 నాటికి 1.1 కోట్ల మందికి వ్యాక్సిన్​ తీసుకున్నారు.

ఎవరు అర్హులు?
2022 జనవరి 1 లోపు 60 ఏళ్లు నిండే వారు వ్యాక్సిన్​ తీసుకోవడానికి అర్హులు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు వారి వయస్సు రుజువు చూపించి వాక్సిన్​ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇక, 45 -నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు వారి దీర్ఘకాలిక అనారోగ్యానికి రుజువులుగా మెడికల్​ డాక్యుమెంట్స్​ను చూపించాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక అనారోగ్యాల జాబితా..
సుమారు 10 సంవత్సరాలకు పైగా డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు, రక్తపోటు చికిత్స చేయించుకుంటున్నవారు, HIV సంక్రమణ, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, గుండె పోటు సమస్య, గుండె మార్పిడి/మూత్రపిండ మార్పిడి/కాలేయ మార్పిడి/హేమాటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడి, ఎడమ జఠరిక సిస్టోలిక్ పనిచేయకపోవడం, తీవ్రమైన వాల్వులర్ గుండె జబ్బులు, పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్‌తో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, రక్తపోటు లేదా మధుమేహంతో కొరోనరీ ఆర్టరీ వ్యాధి, రక్తపోటు లేదా మధుమేహంతో ఆంజైనా (ఛాతీ నొప్పి), రక్తపోటు లేదా మధుమేహంతో డాక్యుమెంటెడ్ స్ట్రోక్, డయాలసిస్‌, లుకేమియా / మైలోమా / లింఫోమా, సికిల్ సెల్ డిసీజ్ / తలసేమియా / అప్లాస్టిక్ అనీమియా / ఎముక మజ్జ వైఫల్యం, క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు లేదా ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారు, అంధత్వం, చెవిటితనం, యాసిడ్ దాడి, కండరాల డిస్ట్రోఫీ, మానసిక వైకల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గలవారు వ్యాక్సిన్​ డ్రైవ్​లో పాల్గొనవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com