ఫ్లోరిడాలో తెలుగుపాటకు పట్టాభిషేకం

- March 09, 2021 , by Maagulf
ఫ్లోరిడాలో తెలుగుపాటకు పట్టాభిషేకం

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్‌,ఇండియా,అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌ లండన్‌వారు అంతర్జాలంలో మార్చి 6,7,8 తేదీలలో తెలుగుపాటకు పట్టాభిషేకం చేశారు.20 మంది ప్రముఖ గాయనీమణులు ఆలపించిన గీతాలలో 100 ఎన్నుకొని అమెరికాలో నివసిస్తున్న తెలుగు గాయని రాధిక నోరి గానం చేశారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైన ఈ కార్యక్రమానికి ఫ్లారిడా రాష్ట్ర సెనేట్‌ సభ్యురాలు లొరేన్‌ ఆస్లే పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ విజయోత్సవంలో ఎంతో కమిట్‌మెంట్‌, ఉత్పాహంతో పాల్గొన్నవారందరికీ హార్దిక శుభాభినందనలు తెలిపారు.ఈ కోవిడ్‌ సమయం స్త్రీలను చాలా కష్టపెట్టిందనీ, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు తమ కుటుంబంతో కలిసి గడపడం కోసం గత్యంతరం లేక వారి వారి ఉద్యోగాలను కూడా వదులుకోవలసిన దుస్థితి వచ్చిందన్నారు. వారికి వేరే మార్గం మిగలలేదని ఆమె తన బాధను వ్యక్తం చేశారు.ఈ కోవిడ్‌ వలన నష్టాలలోనుండి కోలుకోవడానికి కొన్ని ఏళ్ళు పడ్తుందన్నారు.అంతర్జాతీయ ప్రపంచ మహిళాదినోత్సవం చాలా ప్రత్యేకమైన రోజనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు పెద్ద గౌరవమనీ అన్నారు. అంతర్జాలంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో సంబంధబాంధవ్యాలు ఇలాగే చాలాకాలం కొనసాగాలని ఆమె తన కోరిక వ్యక్తం చేశారు.ఫ్లోరిడా, తలహసీకి చెందిన రాధిక నోరి పాడుతున్న 100 పాటలను, ఆమె మధురగానాన్ని ప్రశంసించారు.

మూడు రోజులు జరిగిన ఈ అంతర్జాల కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు జమునా రమణారావు, అమెరికాలో ఉంటున్న ప్రముఖ సినీనటి ఎల్‌. విజయలక్ష్మి, హ్యూస్టన్‌ నివాసి డా॥ రత్న అనిల్‌కుమార్‌, నేష్‌విల్‌ నివాసి డా॥ ఉమా ఇయ్యణ్ణి, పిట్స్‌బర్గ్‌ నివాసి డా॥ కమలారెడ్డి, చికాగో నుంచి డా॥ శారదాపూర్ణ శొంఠి, వాషింగ్టన్‌ నుంచి డా॥ శేషుశర్మ, అట్లాంటానుంచి రేవతీ కొమాండూరి, కాలిఫోర్నియా నుంచి శారద కాశీవఝల పాల్గొన్నారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌ ట్రస్టీ డా॥ వి.పి. కిల్లీ, మరో ట్రస్టీ గీతా పూర్ణ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వంశీ సంస్థల అధ్యక్షులు శిరోమణి డా॥ వంశీ రామరాజు నిర్వహించారు. 100 పాటలు పాడిన ఏకగాయని రాధిక నోరికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధినేత డా॥ వెంకటాచారి చింతపట్ల ఈ కార్యక్రమం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైనట్లు ప్రకటించారు.వంశీ అధ్యక్షురాలు తెన్నేటి సుధ, మేనేజింగ్‌ ట్రస్టీ శైలజ సుంకరపల్లి పర్యవేక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com