కరోనా: సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం ఉందా?...ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస

- March 18, 2021 , by Maagulf
కరోనా: సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం ఉందా?...ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస

జెనీవా: కొవిడ్-19 సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది.

శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా..ఇప్పటివరకు కొవిడ్-19 వ్యాప్తి వాతావరణ అంశాల కంటే ప్రభుత్వం విధించే నిబంధల ద్వారానే ఎక్కువగా ప్రభావితమైంది. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామంది. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు వాయు కాలుష్యం మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపదని కొన్ని అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడిచేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com