బాసర ఐఐఐటీ సీట్ల పెంపు అంశంపై మంత్రి స‌బిత

- March 24, 2021 , by Maagulf
బాసర ఐఐఐటీ సీట్ల పెంపు అంశంపై మంత్రి స‌బిత

హైద‌రాబాద్: నిర్మ‌ల్ జిల్లాలోని బాస‌ర ఐఐఐటీలో సీట్ల పెంపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిశీలిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. బాసర ఐఐఐటీలో సీట్ల పెంపు అంశానికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బిత స‌మాధానం ఇచ్చారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివి ప‌దిలో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థుల‌కు బాస‌ర ఐఐఐటీలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ క్యాంప‌స్ 272 ఎక‌రాల్లో నిర్మిత‌మై ఉంద‌న్నారు. ఇక్క‌డ విద్యార్థుల అవ‌స‌రాల కోసం పోస్టాఫీసు, బ్యాంకుతో పాటు 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఏర్పాటు చేశామ‌న్నారు. బాస‌ర ఐఐఐటీలో మెరుగైన విద్య‌ను అందిస్తున్నామ‌ని, ఇందుకు నిద‌ర్శ‌నం దేశంలోని వెయ్యి యూనివ‌ర్సిటీల్లో బాస‌ర ఐఐఐటీకి 36వ ర్యాంకు రావ‌డ‌మే అని మంత్రి పేర్కొన్నారు. 50 నుంచి 55 శాతం మంది విద్యార్థులు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందుతున్నారు. బాస‌ర ఐఐఐటీకి చెందిన 220 మంది విద్యార్థులు టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించిన పంచాయ‌తీరాజ్‌, ఆర్ అండ్ బీ, ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్ నియామ‌కాల్లో ఉద్యోగాలు పొందార‌ని తెలిపారు.

అయితే ప్ర‌స్తుతం యూనివ‌ర్సిటీలోని మౌలిక వ‌సతుల‌ను దృష్టిలో ఉంచుకుని 1500 మందికి ప్ర‌వేశాలు క‌ల్పించామ‌న్నారు. యూనివ‌ర్సిటీ ఏర్ప‌డిన తొలి రోజుల్లో 2 వేల మంది విద్యార్థుల‌కు ప్ర‌వేశాలు క‌ల్పించారు. కానీ స‌రిప‌డా మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డంతో 2010లో 1000 మందికి మాత్ర‌మే ప్ర‌వేశాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ పెద్ద మ‌న‌సు చేసుకుని 2018లో అద‌నంగా మ‌రో 500 మందికి ప్ర‌వేశాలు క‌ల్పించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ సంఖ్య‌ను 2 వేల‌కు పెంచే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిశీలిస్తామ‌ని మంత్రి స‌బిత స్ప‌ష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com