|| గాలి మువ్వల చప్పుడై ||వెనకేసుకున్నదేమిటోనని
వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడల్లా 
పిడికెడు జ్ఞాపకాలతో ఎదురొస్తావు 
దోసిట్లోని దుఃఖమంతా మల్లెలు చేసి 
వెచ్చగా జోకోడతావు 
కళ్ళని కలల రంగులో ముంచి 
కమ్మని కునుకునిస్తావు 

దూరమో 
భారమో
వేటాడే ముళ్లనో
వెంటాడే నీడనో , నువ్వు తప్ప
ఇంకేదీ నా దరి చేరనీయవు 

ఇక్కడి పొద్దును వెంటబెట్టుకొని నేను
అక్కడి మబ్బులు మూటగట్టుకొని నువ్వు
ఒకే గుండెను చేరోసగం పంచుకొని 
కలిసిపోతుంటాం
కరిగిపోతుంటాం
ఎప్పుడూ తడిసిపోతుంటాం

మాట మరిచినా 
ఊసులు మిగిలున్నట్టు
గుండె ఆగినా 
గురుతులు బతికున్నట్టు
ఎప్పటికీ.... బతికేస్తాం
గాలి మువ్వల చప్పుడై

 

పారువెల్ల

 

 

 

Back to Top