కరోనా పరిస్థితిపై ఉపరాష్ట్రపతి సమీక్ష...
- April 14, 2021
న్యూఢిల్లీ: ‘ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం (టెస్ట్), వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై నిరంతరం దృష్టిపెట్టడం (ట్రాక్), సరైన సమయంలో చికిత్సనందించడం (ట్రీట్)’ వ్యూహాన్ని అనుసరించడం, అమలుచేయడమే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తమమైన మార్గమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసం నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుందని.. ఇందుకోసం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ తీవ్రమైన పరిస్థితుల కారణంగా వైద్య వ్యవస్థపై పెనుభారం పడుతుందన్నారు. గత 14రోజుల్లో వెల్లడైన లెక్కల ప్రకారం దేశంలోని 85 శాతం కరోనా కేసులు, 89 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని.. ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అయితే గతేడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనే విషయంలో భారతదేశం సంసిద్ధంగా ఉందని.. వైద్యవసతులతోపాటు కరోనాకు భద్రమైన, ప్రభావవంతమైన టీకా కూడా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని మరవొద్దని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన పాత్రలో ప్రతి గవర్నర్.. తమ తమ రాష్ట్రాల్లో కరోనాపై జరుగుతున్న పోరాటంలో కీలకంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంపూర్ణ సహకారాన్ని అందజేస్తూ ప్రజలకు భరోసా ఇవ్వడంలో ఏకాభిప్రాయ సాధనతో ముందుకెళ్లాలని సూచించారు. ‘మీ అనుభవంతోపాటు మీకున్న సామర్థ్యాన్ని ఉపయోగించి రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శనం చేయండి. కరోనాను అరికట్టే విషయంలో ప్రభావవంతమైన వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములు కండి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.
కరోనాపై పోరాటంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషి ప్రజా ఉద్యమంగా మారడంలోనూ గవర్నర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. విద్యాసంస్థలు, పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఏడాది కాలంగా ఈ ప్రయత్నంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయని.. రెండో విడత కరోనాపై పోరాటంలోనే వీరి పాత్ర ఇలాగే కొనసాగాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలను, ప్రభుత్వాలు సూచిస్తున్న అంశాలను అర్థం చేసుకుని పాటించడం ద్వారా ప్రజలు కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రతి భారతీయుడూ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
కరోనా వివిధ రూపాల్లో విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. భారతదేశం వ్యూహాత్మక నిర్ణయాలతో ఈ మహమ్మారిని ఏడాదిగా సమర్థవంతంగా ఎదుర్కొందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘మనమంతా సమన్వయం, పరస్పర సహకారంతో గతేడాది కరోనాను విజయవంతంగా అడ్డుకోగలిగాం. ఇకపైనా అదే ధైర్యసాహసాలను, గతంలోని వ్యూహాలను అమలుచేస్తూ వైరస్‌ను ఎదుర్కొందాం’ అన్నారు.

కరోనాపై పోరాటంలో అందరినీ కలుపుకొని పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఈ పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధానమంత్రి సూచనమేరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయడం ద్వారా కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు సరికొత్త ఆలోచనలు, ఉత్తమ వినియోగ పద్ధతులపై చర్చ జరిగి దేశానికి, ప్రజలకు మేలుచేసే అంశాలకు బీజం పడుతుందన్నారు.
‘మనవద్ద సరైన సమాచారం ఉంది, సరిపోయేంతగా సౌకర్యాలున్నాయి. సలహాలు, సూచనలు కూడా సమయానుగుణంగా వస్తున్నాయి. గతానుభవంతోపాట అనుభవజ్ఞులు కూడా మన దగ్గర ఉన్నారు. కావల్సిందల్లా ఆ సలహాలను సమర్థవంతంగా వినియోగించడమే’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రజల భాగస్వామ్యమే అన్నింటికన్నా ముఖ్యమన్న ఆయన.. కరోనాపై పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఓ నివేదికను ఉటంకిస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంకా 50శాతం మంది మాస్కులు ఉపయోగించకపోవడం ఆందోళనకరమన్నారు. ఈ పద్ధతి సరికాదని.. అందరూ బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే బాధ్యతగా మాస్కులు ధరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నెరవేరిస్తేనే కరోనాను కట్టడి చేయగలమని ఆయన స్పష్టం చేశారు.

కరోనా కారణంగా ప్రజలు, వారి జీవితాలపై పెను ప్రభావం పడుతోందని.. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర మంత్రిమండలి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ పోరాటంలో ముందువరసలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఫార్మాసూటికల్స్ పరిశ్రమతోపాటు వివిధ వర్గాలు తమ మద్దతును ఇకపైనా కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తోపాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









