వ్యాక్సినేషన్ గురించి ఇవి తెలుసుకోండి

- May 05, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ గురించి ఇవి తెలుసుకోండి

వ్యాక్సినేషన్ గురించి తెలిసుకోదగిన విషయాలు

మొదటి డోస్ తీసుకున్న తరువాత కరోనా వస్తే ఎలా?
కరోనా నుంచి కోలుకున్న రెండు వారాలకు రెండో డోస్ తీసుకోవచ్చు. అదే మొదటి డోస్ తీసుకోకముందు కరోనా వస్తే, రికవరీ అయిన 28 రోజుల తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలి.

28 రోజులలో రెండో డోస్ తీసుకోవడం కుదరకపోతే ఎలా?
మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దానివల్ల ఇబ్బందేమీ లేదు. కాకపోతే 6 నుంచి 8 వారాలలోపు కచ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

కొవాక్సిన్, కోవిషీల్డ్ లో ఏది మంచిది?
భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఇందులో మనకి నచ్చిన వ్యాక్సిన్ ను ఎంచుకునే అవకాశం లేదు. టీకా కేంద్రాలలో ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నారు. అయితే ఇందులో ఒకటి మంచిది, ఇంకోటి కాదు అని ఏమి లేదు. ఇవి రెండూ కూడా కరోనా వైరస్ పై సమర్ధంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. అందువల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. 

మొదటి డోస్ ఒక రకం వ్యాక్సిన్, రెండో డోస్ మరొక రకం వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
కొవాక్సిన్ ఇనాక్టీవేటెడ్ వైరస్ పద్దతిలో తయారయింది. కోవిషీల్డ్ వైరల్ వెక్టర్ పద్దతిలో తయారయింది. అందువల్ల రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి.

వ్యాక్సినేషన్ ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలా?
కరోనా వ్యాక్సిన్ వేసే ముందు భారత్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కోవిడ్-19 టెస్ట్ చేయడం లేదు. అయితే, కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

థైరాయిడ్ పేషంట్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
థైరాయిడ్ పేషంట్లు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

రెండు డోసులు తీసుకుంటే మాస్క్ వాడక్కర్లేదా?
రెండు డోసుల వ్యాక్సినేషన్ తర్వాత కూడా కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది. కానీ, దాని తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. అయితే, వీరిద్వారా ఇతరులకు వైరస్ సంక్రమించే అవకాశం మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తర్వాత కూడా మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరి.

రెండు డోసులు తీసుకునేవరకు ప్రత్యేకమైన డైట్ ఎమన్నా ఫాలో అవ్వాలా?
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేంతవరకు ఎలాంటి ప్రత్యేక డైట్ ఫాలో వలసిన అవసరం లేదు. ఎప్పుడూ తీసుకునే ఆహారమే తీసుకోవాలి. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు ఆపేయాలా?
కరోనా వ్యాక్సిన్ పై ఇతర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించావు. కాబట్టి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు నిరభ్యంతరంగా వాటిని వేసుకోవచ్చు.

కరోనా బారిన పడి కోలుకుంటే వ్యాక్సిన్ అవసరమా?
గతంలో కరోనా బారిన పడినవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మళ్ళీ వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది.

గర్భిణీలు, బాలింతలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
ప్రస్తుతం భారత్ లో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ను గర్భిణీలు, పిల్లలపై చేయలేదు. కాబట్టి గర్భిణీలు, బాలింతలు, పిల్లలు వ్యాక్సిన్లు తీసుకోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫారసులు చేయలేదు.

వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి?
ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఒళ్ళు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావచ్చు. కానీ, ఇవన్నీ రెండు నుంచి మూడు రోజులలో తగ్గిపోతాయి. కాబట్టి వీటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com