వారిపై కఠిన చర్యలు తప్పవు: ఏపీ డీజీపీ

- May 09, 2021 , by Maagulf
వారిపై కఠిన చర్యలు తప్పవు: ఏపీ డీజీపీ

విజయవాడ: కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. నగరంలో ఆయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, అందరూ రెండు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు.

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

కరోనా  లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104,108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com