‘కోవిడ్‌ వారియర్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌

- May 12, 2021 , by Maagulf
‘కోవిడ్‌ వారియర్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌

హైదరాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని ఇంపాక్ట్‌ గురు ఫౌండేషన్‌తో కలిసి అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ నేడు ‘కోవిడ్‌ వారియర్‌ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ‘ఏంజెల్‌ # థాంక్‌ ఏ నర్స్‌’ (“ANGEL” #ThankANurse) శీర్షికన ప్రారంభించింది. ‘ఏంజెల్‌ (ANGEL)అంటే అడ్వాన్స్‌ నర్సెస్‌ గ్రోత్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ లెర్నింగ్‌. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌  వ్యవస్ధాపక బృందంలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా ముఖ్యదాతగా కూడా ఉంది.ఇతర భాగస్వాములైనటువంటి మైక్రోసాఫ్ట్‌ ఇండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) ; అమిటీ యూనివర్శిటీ, ఇక్ఫాయ్‌ యూనివర్శిటీ, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ), సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ మరియు ఇతర సంస్థలు ఇంపాక్ట్‌ మరియు నాలెడ్జ్‌ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. జార్ఖండ్‌, ఒడిషా రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలకు చెందిన యువతతో పనిచేయడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా నర్సింగ్‌ వృత్తిలో వారికి ఉపాధి కల్పించడంలో తోడ్పడిన టాటా స్టీల్‌ ఫౌండేషన్‌ ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వారికి నైపుణ్యాభివృద్ధి చేయడానికి కృషి చేయనుంది.

కోవిడ్‌ వారియర్‌ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం – ‘ఏంజెల్‌ # థాంక్‌ఏ నర్స్‌’ను వినూత్నమైన సామాజిక ప్రభావ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దారు. ఇది నర్సుల తోడ్పాటును గుర్తించడంతో  పాటుగా వారి కెరీర్‌లను పునర్నిర్వచించడానికి,  పునరావిష్కరించడానికి మరియు క్లీనికల్‌, మేనేజ్‌మెంట్‌, పరిశోధన మరియు నర్సింగ్‌  వృత్తిలో ఇతర కీలకాంశాలలో  విజయం సాధించడంతో పాటుగా వృద్ధి చెందేందుకు తోడ్పడనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఒక లక్ష మంది నర్సులకు రాబోయే కొద్ది సంవత్సరాలలో నైపుణ్యాభివృద్ధి చేయడంతో పాటుగా ఈ కార్యక్రమ కాలంలో మెరుగైన నైపుణ్యం సంతరించుకునేలా నర్సులకు శిక్షణ అందించడం కోసం ఒక్కో నర్సుపై 50వేల రూపాయలను స్కాలర్‌షిప్‌ల రూపంలో ఖర్చు చేయనున్నారు. పలు విద్యాసంస్థలు,  నైపుణ్యాభివృద్ధి,స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో భారతదేశ వ్యాప్తంగా నర్సులకు ఉచిత కంటెంట్‌, శిక్షణను అందించడనికి ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 1000 మంది నర్సులకు  నైపుణ్యాభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది.

 ఈ కార్యక్రమ తొలి దశ,  కోవిడ్‌ సంబంధిత క్లీనికల్‌, ప్రజా ఆరోగ్యం, విపత్తు నిర్వహణ కోణంలో దృష్టి సారించడం ద్వారా నర్సులు మరిన్ని ప్రాణాలు కాపాడేందుకు వీలు కల్పిస్తుంది. రెండవ దశలో, రోజు రోజుకీ వృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలు అందుకునే రీతిలో నర్సింగ్‌ కమ్యూనిటీ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా సమగ్రమైన శిక్షణను అందిస్తుంది.

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌  మరియు  కోవిడ్‌ వారియర్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ ఏంజెల్‌ # థాంక్‌  ఏ నర్స్‌ దాత  డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ మహమ్మారి నర్సుల ఆవశ్యకతను తెలియజేసిందన్నారు. కోవిడ్‌–19తో పోరాటంలో వారు ముందు వరుసలో ఉండటమే కాదు ప్రాణాలను కాపాడటంలో  అపారమైన తోడ్పాటునందిస్తున్నారు. ఎన్నో త్యాగాలను వారు చేస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు మాత్రం లేదు.ఈ నర్సులకు సుసంపన్నమైన భవిష్యత్‌ను అందించే ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నిజాయితీగా మా కృతజ్ఞతలను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాము. వృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ విభాగంలో తమ వంతు పాత్రను మరింతగా విస్తరించుకునేందుకు నర్సులను ఈ కార్యక్రమం సిద్ధం చేస్తుందన్నారు.

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌–19తో జరుగుతున్న పోరాటంలో అత్యంత కీలకమైన పాత్రను నర్సులు పోషిస్తున్నారన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు నర్సులకు తమ కెరీర్‌ సంబంధిత నైపుణ్యాలు, విజ్ఞానం అందించనుందన్నారు. తద్వారా రోగులకు మెరుగైన చికిత్సా ఫలితాలు సాధ్యం కావడంతో పాటుగా వృత్తిపరంగా నర్సులు ఎదిగేందుకు సైతం ఇది సహాయపడనుందన్నారు. తమ కెరీర్‌లను తీర్చిదిద్దుకుంటూనే తమ విద్యను కొనసాగించే అవకాశాన్నీ నర్సులకు ఈ కార్యక్రమం అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత ప్రభుత్వ పూర్వ నర్సింగ్‌ సలహాదారు మరియు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు డాక్టర్‌ టీ దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ పలు క్లీనికల్‌ స్పెషలైజేషన్స్‌లో తమ కెరీర్‌ మెరుగుపరుచుకునే రీతిలో నర్సులకు శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను జాతీయ ఆరోగ్య విధానం  నొక్కి చెబుతుంది. నర్సు ప్రాక్టీషనర్‌గా వారికి శిక్షణ అందించడం వల్ల వారు హెల్త్‌కేర్‌ డెలివరీ వ్యవస్థలో ఓ సభ్యునిగా సమర్థవంతంగా పనిచేయవచ్చన్నారు.  ఏంజెల్‌ కార్యక్రమాన్ని నర్సుల విజ్ఞానం, నైపుణ్యం మెరుగుపరిచే రీతిలో తీర్చిదిద్దామన్నారు. తద్వారా వారి బాధ్యతలతో పాటుగా జీతాలనూ పెంచుకోగలరని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థవిడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ నర్సింగ్‌ (సోవన్‌) నివేదికనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

ఇంపాక్ట్‌ గురు ఫౌండేషన్‌ ఫౌండర్‌ పియూష్‌ జైన్‌ మాట్లాడుతూ భారతదేశంలో సుప్రసిద్ధ హెల్త్‌కేర్‌ సంస్థలలో ఒకటైన అపోలో గ్రూప్‌ ఫౌండింగ్‌ సర్కిల్‌ సభ్యునిగా మరియు పలు ఇతర విద్య, నైపుణ్య, కార్పోరేట్‌ భాగస్వాముల మద్దతుతో ఈ కార్యక్రమం ఆరంభించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.  భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని హెల్త్‌కేర్‌ సంస్థలు, ఆస్పత్రులు, వైద్య  విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా మా నర్సులకు నైపుణ్యాభివృద్ధి చేయడంతో పాటుగా అత్యుత్తమ కెరీర్‌ అవకాశాలనూ సృష్టించబోతున్నామన్నారు.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షులు అనంత్‌ మహేశ్వరి మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య, భద్రత, సంక్షేమానికి మద్దతునందించడంలో నర్సింగ్‌ కమ్యూనిటీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఏంజెల్‌ # థాంక్‌ ఏ నర్స్‌ అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమానికి మద్దతునందిస్తుండటాన్ని మైక్రోసాఫ్ట్‌ గర్వంగా భావిస్తుందన్నారు.

ఈ కార్యక్రమం గురించి మరింతగా తెలుసుకోవడంతో పాటుగా నర్సుగా, ఆస్పత్రి, నాలెడ్జ్‌ భాగస్వామి, స్కిల్లింగ్‌ పార్టనర్‌ లేదా టెక్నాలజీ భాగస్వామిగా నమోదుచేసుకునేందుకు  http://www.thankanurse.in చూడవచ్చు.

ఆర్థికంగా కోవిడ్‌ వారియర్‌ అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమం– ఏంజెల్‌ థాంక్‌ ఏ నర్స్‌ కార్యక్రమానికి మద్దతునందించేందుకు https://www.impactguru.com/thankanurseచూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com