అరుదైన కళారూపాలను ఆదరించిన సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'

- May 31, 2021 , by Maagulf
అరుదైన కళారూపాలను ఆదరించిన సింగపూర్ \'శ్రీ సాంస్కృతిక కళాసారథి\'

సింగపూర్ లోని ప్రముఖ సాంస్కృతిక కళాసంస్థ అయిన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వారు 'గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్' వారితో కలిసి  కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో 'సంప్రదాయక మరియు జానపద కళారూపాలు' అనే ఒక అంతర్జాల కళా ప్రదర్శనను ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు రచయిత తనికెళ్ళ భరణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి డా.వంశీ రామరాజు గారు గౌరవ అతిథులుగా విచ్చేసి,ఈ ఉభయ సంస్థల ప్రయత్నానికి తమ ఆశీస్సులను అందించి, కళాకారుల ప్రదర్శనలను తిలకించి తమ అభినందనలు తెలియజేశారు. మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ తదితర దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, 'జనరంజని- ముంబై మొదలగు భారతీయ సంస్ధల ప్రతినిధులు అందరూ పాల్గొని వేదికను 'వసుధైక కుటుంబ వేడుక' గా మార్చడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరింపజేసింది. 

సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి ఆలవాలమైన సంప్రదాయ కళలు మరియు జానపద కళారూపాలకు చేయూతనిచ్చే సంకల్పంతో, నేటి కరోనా పరిస్థితుల్లో సరైన అవకాశాలు వేదికలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో కళాకారులను ఆదరించి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్న జి.హెచ్.వి వారి ఉద్దేశం మాకెంతో నచ్చి ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని అందించామని, ఈ ప్రయత్నం విజయవంతం కావడం సంతోషంగా ఉందని, అన్ని ప్రాంతాలలోనూ వివిధ సంస్థల వారు అక్కడి కళాకారులకు ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం కాగలదని ఆశిస్తున్నాము" అని తెలిపారు

జి.హెచ్.వి చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జానపద కళాకారుల కోసం తాము విజయనగరంలో వేదికను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నామని, కరోనా కారణాలవల్ల గత సంవత్సరం నుండి చేయలేకపోతున్న ఈ కార్యక్రమానికి సింగపూర్ సంస్థ వారు ముందుకు వచ్చి అంతర్జాల వేదిక ఏర్పాటుచేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం చాలా ఆనందంగా ఉందని, తద్వారా విజయనగరం లోని కళాకారుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంస్థల వారికి తెలియడానికి చక్కటి అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

రేలారేరేలా జానకీరావు, గజల్ వినోద్ ల హుషారైన గీతాలు, నీలబోను సత్యం కుటుంబ బృందంచే 'తప్పెటగుళ్ళు', ఆదిభట్ల రవి భాగవతార్ చే హరికథాగానం, అనిల్ తెలికిచెర్ల,సౌమ్య & చి.శ్రీతోధ్భవ్ లచే లఘు నాటిక, మోడేకుర్తి వెంకట కామేశ్వరరావుచే మురళీ వాదన, దాసరి తిరుపతి నాయుడు మాస్టారిచే రంగస్థల పద్యాలు, బుజ్జి కుటుంబబృందంచే 'చెక్కభజన', "నర్తనశాల" మరియు "భగవతి నృత్య కళామందిర్" నృత్య విద్యార్ధినులచే నృత్యాలు మొదలైన అంశాలు మూడు గంటల పాటు అతిథులను, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులను, సింగపూర్ మరియు విజయనగర సంస్థల సభ్యులను, పుర ప్రముఖులను అద్భుతంగా అలరించాయి.జి.హెచ్.వి చారిటబుల్ ఫౌండేషన్ వారు సుమారు 27 వేల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా సేకరించి కళాకారులకు అందజేయగా, మలేషియా ఆస్ట్రేలియా మొదలగు దేశాల సంస్థల ప్రతినిధులు మరి కొన్ని విరాళాలను ప్రకటించడం అందరికీ ప్రత్యేక ఉత్సాహాన్ని ఇచ్చింది. 

జి.హెచ్.వి సంస్థ ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, సింగపూర్ నుండి ఊలపల్లి భాస్కర్,రామాంజనేయులు చామిరాజు,కుమారి మౌక్తిక మంగిపూడి, సాంకేతిక సహాయం అందించగా,గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహణలో యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని మూడు వేలమంది వీక్షించారు.ఈ ఈవెంట్ మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

ఈ క్రింది లింకు ద్వారా పూర్తి కార్యక్రమాన్ని చూడవచ్చును

https://youtu.be/j0wcNJunqV0

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com