ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ,తలసాని

- June 16, 2021 , by Maagulf
ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ,తలసాని

హైదరాబాద్: హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బుధవారం నాడు ప్రారంభించారు. ఎం.ఎల్.సి ఎం.ఎస్ ప్రభాకర్ రావు, ఎం.ఎల్.ఏ మాగంటి గోపీనాథ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె. దామోదర్ , తెలంగాణ  రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి, కమీషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమిషనర్లు షీఖా గోయల్, అనిల్ కుమార్ జాయింట్ సి.పి ఎ.ఆర్  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రాష్ట్ర హోం శాఖామంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో  కార్పొరేట్ స్థాయి పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం  ఆధునిక సదుపాయాలను నూతన పోలీస్ స్టేషన్ భవనాలలో నిర్మిస్తున్నామని తెలియజేశారు.ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కోసం 1040 చదరపు గజాల భూమిలో  15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనాన్ని ని  రూ .4.26 కోట్లు ఖర్చుతో నిర్మించమన్నారు.  సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పథకం కింద ఈ భవనాలు నిర్మిస్తున్నామని, స్నేహపూర్వక పోలీసింగ్ లో  తెలంగాణ పోలీసులకు ముఖ్యమైన స్థానం ఉందని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. అత్యాధునికంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో మరింతగా ఉపయోగపడుతుందని ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలకు మంజూరు చేస్తున్నారని హోం మంత్రి అన్నారు.వీటి ద్వారా ప్రజలకు మరింత సేవలందించే అవకాశం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..,.. తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా తమకంటూ  ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారని  తెలిపారు. సిసిటివి ఏర్పాటులో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, సిసిటివి కెమెరాల వ్యవస్థాపనలో హైదరాబాద్ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. తమ వంతు కొన్ని నిధులను కూడా సీసీటీవీ కెమెరాల కోసం ప్రకటించామని తెలియజేశారు.

స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.... ఎస్ ఆర్  నగర్ పోలీస్ స్టేషన్ విస్తీర్ణం ఎక్కువై దూరం కావడంతో మరొక పోలీస్ అవుట్ పోస్టును బొరబండ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో  శాంతిభద్రతలకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు మెరుగైన స్థాయిలో కాపాడాల్సి ఉందని అన్నారు. సమస్యలను పరిష్కరించడానికి మరియు భద్రతను కల్పించడానికి " షీ టీమ్ " ల వంటి వినూత్న పథకాలను ప్రారంభించామని తెలియజేశారు రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణ కోసం అంకితమై ఎన్నో విజయాలను సాధించిందన్నారు.  కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుతూ దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు.పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు అనుసంధానిస్తా మన్నారు.ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ..,. చట్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దొంగతనాలు, దోపిడీల కన్నా ఎక్కువగా ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి, దేదీప్య రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com