హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జూన్‌లో 4 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు

- July 05, 2021 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జూన్‌లో 4 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు
  •  కోవిడ్-19 సెకెండ్ వేవ్ అనంతరం భారతదేశమంతటా దేశీయ విమాన ప్రయాణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకోవడం, వివిధ రాష్ట్రాలలో సడలించిన ప్రయాణ ఆంక్షలు, తప్పనిసరి ఆర్టీ-పిసిఆర్ టెస్టులతో విమాన ప్రయాణాలపై ప్రయాణికుల ధైర్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని కల్పిస్తోంది.
  • వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ -19 లాక్డౌన్ సడలింపులతో, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని దేశంలోని అన్ని నగరాలకూ విమానాల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల్లో పెరుగుదల నమోదైంది. జూన్ 1న కేవలం 100కు పైబడిన విమానాల నుంచి నెల రోజుల వ్యవధిలో విమానాల రాకపోకల సంఖ్య దాదాపు 100 శాతానికి పెరిగి, జూన్ 27న అత్యధికంగా 199 విమానాల రాకపోకలు జరిగాయి. 
  • జూన్ 1న సుమారు 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించగా, జూన్ 27న అది గరిష్టంగా 22 వేలను తాకింది. విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకులు సంఖ్య నెల రోజుల్లో రెట్టింపు అయింది. జూన్ 1 – 30 తేదీల మధ్య విమానాశ్రయం నుంచి 4 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 35 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. 
  • హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు దేశంలోని 42 గమ్యస్థానాలకు, 10 అంతర్జాతీయ గమ్యస్థానాలకు రాకపోకలను కలిగి ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, వైజాగ్ గత నెల రోజుల్లో అతి ఎక్కువ ప్రయాణికుల వృద్ధిని నమోదు చేసిన మొదటి 5 నగరాలు. ఇదే కాలంలో ప్రయాణీకుల సంఖ్య వారీగా, ముంబై 84%తో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. స్నేహితులు & బంధువుల సందర్శన (VFR), SME వ్యాపార ప్రయాణాలు ప్రయాణీకుల సంఖ్య పెరగడానికి ఎక్కువగా దోహదపడ్డాయి.
  •  కోవిడ్ నిబంధనల అమలుకు విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్ టీమ్‌ల సహాయంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. కోవిడ్ భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి GHIAL కు చెందిన 20 మంది అధికారులను ప్రత్యేక పోలీసు అధికారులు(SPO)గా నియమించారు. విమానాశ్రయంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించని ప్రయాణీకులు, సందర్శకులు, సిబ్బందికి జరిమానా విధించే అధికారం ఈ SPOలకు ఉంటుంది. టెర్మినల్‌లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని  కోరుతూ నిరంతరం మూడు (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) భాషలలో ప్రకటనలు చేస్తున్నారు.
  • కోవిడ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో సైనేజ్‌లను ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ చర్యలపై ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం కోవిడ్ జాగ్రత్తల సమాచారం వివిధ ప్రదేశాలలో ప్రదర్శించబడుతోంది.
  • కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి, ప్రయాణీకులు ఇంట్లో చెకిన్ చేయమని లేదా సెల్ఫ్-చెకిన్ సౌకర్యం, సెల్ఫ్-బ్యాగ్ ట్యాగ్ సౌకర్యం లాంటి సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలను ఉపయోగించుకోమని ప్రోత్సహిస్తున్నారు. విమానాశ్రయం ఫోర్‌కోర్ట్ ప్రాంతంలో, చెక్-ఇన్ హాల్స్‌లో భౌతిక దూర నిబంధనల ప్రకారం సెల్ఫ్-చెకిన్ కియోస్క్‌లను ఏర్పాటు చేసారు. టచ్-లెస్ టెక్నాలజీని కలిగిన ఈ QR కోడ్ ఫ్రెండ్లీ కియోస్కులు చెకిన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సహాయపడతాయి. 
  • దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక విమానాశ్రయం హైదరాబాద్. కాంటాక్ట్‌లెస్ ఈ-బోర్డింగ్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది. ఇది బోర్డింగ్ కార్డుల మాన్యువల్ స్టాంపింగ్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది.
  • GMR నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సురక్షితమైన కాంటాక్ట్-లెస్ ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి నిరంతరం వినూత్న మార్గాల కోసం అన్వేషిస్తుంది. దీనికి అనుగుణంగా, విమానాశ్రయంలోని అన్ని ఎలివేటర్లను పుష్-బటన్ కంట్రోల్ నుండి సురక్షితమైన టచ్-లెస్ ఎలివేటర్లుగా మార్చారు. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీపై ఆధారపడిన ఈ టెక్నాలజీలో ఎలివేటర్ బటన్ తాకే అవసరం లేకుండా 0.1-10 సెంటీమీటర్ల దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చు. 
  • క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్‌తో విమానాశ్రయంలో కార్యాకలాపాలను మెరుగుపరిచేందుకు, రద్దీని తగ్గించేందుకు GHIAL ఒక పైలట్ ప్రాజెక్టులో కూడా పాల్గొంటోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీడియో అనలిటిక్స్ సహాయంతో విమానాశ్రయ భద్రత మరింత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన క్యూ నిర్వహణ వ్యవస్థ ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కాలంలో సురక్షిత ప్రయాణానికి దోహదపడుతుంది. అధునాతన కెమెరా ఆధారిత వీడియో అనలిటిక్స్ సొల్యూషన్ ప్రయాణీకుల రద్దీని; వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, భౌతిక దూర పర్యవేక్షణలో సహాయపడుతుంది.జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ క్లిష్ట సమయం ప్రయాణికుల సంఖ్య నెల రోజుల్లో 4 లక్షలు దాటడం విమాన ప్రయాణంలో వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. దేశంలోని వివిధ నగరాలలో కోవిడ్ తగ్గుముఖం పట్టడం, నిబంధనలు సడలించడంతో విమాన ప్రయాణం క్రమంగా పుంజుకుంటోంది. దీన్ని మరింత వేగవంతం చేయడానికి మేము వినూత్న పరిష్కారాలను అవలంబిస్తున్నాం. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే నెలల్లో ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని మా ఆశాభావం. సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ, సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవం కోసం మేము నిరంతరం యూజర్-ఫ్రెండ్లీ సాధనాలను ఉపయోగించుకుంటున్నాం” అన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com