తుది శ్వాస విడిచిన బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్

- July 07, 2021 , by Maagulf
తుది శ్వాస విడిచిన బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. వృద్ధాప్యంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న దిలీప్ కుమార్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో జూన్ నెలలో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్ననప్పటికీ ఇతర సమస్యలు ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. గత వారం ముంబై శివారులోని హిందూజ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. దిలీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన భార్య సైరా భాను సోమవారం తెలిపారు. మీ అందరి ప్రార్థనల వల్ల దిలీప్ కుమార్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు.

దిలీప్ కుమార్ అసలు పేరు..మహమ్మద్ యూసుఫ్ ఖాన్. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పెషావర్‌లో 1922లో డిసెంబర్ 11న దిలీప్ కుమార్ జన్మించారు. 1944లో జ్వర్ భాటా చిత్రం ద్వారా సినిమాల్లోిక ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచీ 1998 వరకు బాలీవుడ్ చిత్రసీమను ఆయన ఏలారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆయన సినిమాలు చేశారు. బాలీవుడ్లో దిలీప్ కుమార్‌కు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. ఇప్పటి వరకు 65 సినిమాల్లో నటించారు. దేవదాస్, నయా దౌర్, మొగల్ ఇ అజామ్, గంగా జమునా, క్రాంతి, కర్మ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చివరగా 1998లో వచ్చిన ఖిలా సినిమాలో దిలీప్ కుమార్ నటించారు. 1991లో ఆయన్ను పద్మ భూషణ్, 2015లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 1988లో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను నిషానే ఇంతియాజ్ అవార్డుతో సత్కరించింది. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. దిలీప్‌ కుమార్ మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌ నటులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com