గల్ఫ్ ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణ పై ఇండియా ఫోకస్

- July 11, 2021 , by Maagulf
గల్ఫ్ ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణ పై ఇండియా ఫోకస్

న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో గల్ఫ్ కంట్రీస్ కు విమాన ప్రయాణాలను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇండియా. ఈ మేరకు గల్ఫ్ దేశాల్లోని భారత రాయబారులకు  విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్  పిలుపునిచ్చారు. భారత్ లో కోవిడ్ తీవ్రత తగ్గిందనే వాస్తవిక పరిస్థితులను వివరించి, ఆయా దేశాల నుంచి భారత్ కు ప్యాసింజర్ విమానాలను పునరుద్ధరించేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాయబారులకు సూచించారు. కొన్నాళ్ల క్రితం వరకు కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత్ పై గల్ఫ్ కంట్రీస్ ట్రావెల్ బ్యాన్ కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుతం రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అయినా గల్ఫ్ దేశాలు భారత్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించటం లేదు. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసే ప్రవాసీయులు, సెలవులు, ఇతర కారణాలతో గల్ఫ్ దేశాల నుంచి ఇండియా వచ్చిన కుటుంబాలు, విద్యార్ధులు తిరిగి వెళ్లే మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గల్ఫ్ దేశాలతో విమాన ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కొన్నాళ్లుగా భారత ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇటీవలె జరిగిన జీ-20 సదస్సులో కూడా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అంశాన్ని లేవనెత్తారు. సౌదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఇప్పుడు రాయబారుల ద్వారా ఆయా దేశాలకు భారత్ లోని వాస్తవ పరిస్థితులను వివరించి భారత్-గల్ఫ్ దేశాల మధ్య తిరిగి సాధారణ స్థితిలో ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేలా ప్రయత్నాలు చేస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com