ప్రజలకు మోడీ పిలుపు..‘ప‌ద్మ’ అర్హులెవ‌రో సూచించండి..

- July 11, 2021 , by Maagulf
ప్రజలకు మోడీ పిలుపు..‘ప‌ద్మ’ అర్హులెవ‌రో సూచించండి..

న్యూఢిల్లీ: ప‌ద్మ పుర‌స్కారాల‌కు అర్హులైన వారి పేర్ల‌ను ప్ర‌భుత్వానికి సూచించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు. క్షేత్ర స్థాయిలో అసాధారణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్రజలకు, దేశానికి సేవలందిస్తున్నవారిని ‘పద్మ‌’ పురస్కారాల కోసం సూచించాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. విశిష్ట సేవలు అందించిన వారిని గౌరవించేందుకు ఇచ్చే ఈ పురస్కారాలు ఎవరికి దక్కితే బాగుంటుందని భావిస్తే వారి పేర్లను సూచించాలన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
‘క్షేత్ర స్థాయిలో అసాధారణ కృషిచేసే అనేక మంది ప్రతిభావంతులు భారత్‌లో ఉన్నారు. అయితే వారి గురించి అంద‌రికీ అంత‌గా తెలియదు. అలాంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తుల గురించి మీకు తెలుసా..? అయితే వారి పేర్ల‌ను మీరు ప‌ద్మ పుర‌స్కారాల కోసం నామినేట్ చేయ‌వ‌చ్చు. మీ నామినేష‌న్‌లను సెప్టెంబ‌ర్ 15 లోపు ఎప్పుడైనా పంప‌వ‌చ్చు’ అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.

కాగా, ‘పద్మ’ పురస్కారాలను కేంద్రం 1954లో ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుంచి ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అవార్డుల‌ను ప్రకటిస్తుంది. సమాజనికి విశిష్ట సేవలందించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను (ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌విభూష‌ణ్‌) ప్ర‌దానం చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com