పీఎస్‌ఎల్‌వీ- సీ32 విజయవంతం

- March 10, 2016 , by Maagulf
పీఎస్‌ఎల్‌వీ- సీ32 విజయవంతం

దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌) నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 32 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోని ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థలో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. 44.4 మీటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.నావిగేషన్‌ వ్యవస్థపై పనిచేసేందుకు వీలుగా ఇస్రో 2013లో తొలిసారిగా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదే ఇండిపెండెంట్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌). ఈ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. మార్చి నెలాఖరు నాటికి నావిగేషన్‌ వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గతంలోని ఇస్రో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాలను చూసినట్లయితే.. * 2013, జూలై 1 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ * 2014, ఏప్రిల్‌ 4 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బీ * 2016, అక్టోబర్‌ 16 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సీ * 2015, మార్చి 28 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డీ * 2016, జనవరి 20 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకతలేమిటంటే.. కచ్చితమైన గమనాన్ని నిర్దేశించేందుకు వీలుగా భారత్‌ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ శాటిలైట్లను ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహాల జీవితకాలం 12 ఏళ్లు. 1500 కిలోమీటర్ల మేర కచ్చితమైన దిశను నిర్దేశించేలా ఈ ఏడు ఉపగ్రహాలు పనిచేస్తాయి. * దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థలో ఈ శాటిలైట్లు కీలకం కానున్నాయి. * భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలందించేందేలా వీటిని రూపొందించారు. * విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలోనూ ఈ ఉపగ్రహాలు సాయం చేస్తాయి. * విపత్తు సమయంలో బాధితులకు సహకారాన్ని అందిస్తాయి. * డ్రైవర్లకు విజువల్‌, వాయిస్‌ నావిగేషన్‌ * మొబైల్‌ ఫోన్లను అనుసంధానం చేయడంలో సాయపడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com