సింగపూర్ చిన్నారుల నోట తెలుగు భాగవత ఆణిముత్యాలు

- July 18, 2021 , by Maagulf
సింగపూర్ చిన్నారుల నోట తెలుగు భాగవత ఆణిముత్యాలు

సింగపూర్: భాగవతం ఆణిముత్యాలు.ఆర్గ్ వారి  "రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ - 2021" సింగపూర్ కార్యక్రమం అంతర్జాలంలో శనివారంనాడు అద్భుతంగా జరిగింది. సింగపూర్ వంటి చిన్న దేశం నుంచి కూడా 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను నేర్చుకొని పాడి వినిపించడంతో పాటు చక్కటి తెలుగులో ఆ పద్యాల యొక్క సందర్భాన్ని తాత్పర్యాన్ని కూడా వర్ణించి చెప్పి పలువురు పెద్దల ప్రశంసలు అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ భాగవత పద్యపఠన పోటీలలో భాగంగా సింగపూర్ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఈ వారాంతంలో తొలిదశ పోటీ కార్యక్రమాన్ని సింగపూర్ లోని ప్రధాన సంస్థలైన 'కాకతీయ సాంస్కృతిక పరివారం','తెలుగు భాగవత ప్రచార సమితి','శ్రీ సాంస్కృతిక కళాసారథి' మరియు 'సింగపూర్ తెలుగు సమాజం' కలిసి అంతర్జాల వేదికపై చక్కగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా అమెరికా నుండి 'భాగవత ఆణిముత్యాలు' సంస్థ అధ్యక్షులు మల్లిక్ పుచ్చా, మరియు నిర్వాహకులు సాయి రాచకొండ, ప్రముఖ గాయకులు నేమాని పార్థసారథి విచ్చేసి చిన్నారులకు ఆశీస్సులను అందించారు. 

న్యాయనిర్ణేతలుగా లంక దుర్గాప్రసాద్,పాతూరి రాంబాబు,దొర్నాల రాధాకృష్ణ శర్మ  విచ్చేసి చిన్నారుల పద్య పఠనానికి వారి స్పందనలను ఆశీస్సులను తెలియజేశారు.కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు ఊలపల్లి భాస్కర్ మాట్లాడుతూ  భాగవతం వంటి ఆధ్యాత్మిక నిధిని మన భావి తరాలకు అందజేయడం ఎంతో అవసరమని, అందుకు IBAM వంటి సంస్థలు ఇటువంటి పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో ముఖ్యంగా భాగవతంపై ఆసక్తి పెరిగేందుకు తోడ్పడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో సింగపూర్ నుండి తమ చిన్నారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని" హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేక బహుమతిగా నేమాని పార్థసారథి చే  నెల రోజుల పాటు భాగవత పద్యాల  శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే కార్యక్రమంనుండి ఎంపిక చేయబడిన చిన్నారులు సెప్టెంబరులో జరుగనున్న రెండవ దశ పోటీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర రెడ్డి, కాకతీయ సాంస్కృతిక పరివారం ఉపాధ్యక్షుడు సుబ్బు పాలకుర్తి , శ్రీ సాంస్కృతిక  కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ తదితరులు పాల్గొని చిన్నారులకు చక్కటి ప్రోత్సాహాన్ని, అభినందనలని అందజేశారు. 

ఈ కార్యక్రమానికి  నమోదు చేసుకున్న పిల్లలకి రాధ పింగళి గత ఆరు వారాలుగా తర్ఫీదునిచ్చి పోటీకి వన్నె తెచ్చారు.రామాంజనేయులు చామిరాజ్ వ్యాఖ్యాతగా, సమన్వయకర్తగా చేసారు. గణేశ్న రాధా కృష్ణ సాంకేతిక సమన్వయం అందించగా చివుకుల సురేష్,జాహ్నవి వేమూరి, రాధికా మంగిపూడి  తదితరులు సాంకేతిక సహకారం అందించారు. 

పూర్తి కార్యక్రమం వీక్షించేందుకు

https://www.facebook.com/events/598805884439299

https://youtu.be/HTyYOLZxTuw

https://www.facebook.com/events/214983373851147

https://youtu.be/dP7zU_0_x3s

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com