నా మాతృ భూమి.....!!

రోజూ నన్ను నేను మోసం చేసుకుంటునే ఉన్నా
కన్నతల్లిని మరిచా పురిటి గడ్డను వదిలేసా
డాలర్ల బరువుతో రూపాయిని బేరీజు వేసా
చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన దేశభక్తిని వదిలేసా
అమ్మ భాష కూడు బెట్టలేదని అరకొరగా వచ్చిన
ఆంగ్ల భాషను అందలమెక్కించా అదే జీవితమనుకొన్నా
అనుక్షణం భయంతో చస్తూ బతుకుతున్నా
అదే స్వర్గమని మాయలో పడి అమృతమయిని
నిరాదరణకు గురి చేసిన నా నిర్లక్ష్యపు విలువ
కట్టలు తెంచుకున్న ఓ కన్నపేగు ఆక్రోశం చేసిన ఆర్తనాదం
వేల గొంతుకలుగా గుచ్చుతుంటే...
సప్త సముద్రాలను దాటిన మాతృప్రేమలో కలసిన
దేశాభిమానం మదిని తాకుతూనిదురలేపగా
కలో గంజో అయినవాళ్ళ మద్యన తాగుతూ
జన్మనిచ్చిన అమ్మ ఋణం కన్నా ఆ అమ్మకు
ప్రాణం పోసిన గడ్డ పవిత్రతే ముఖ్యమని
అసహనం, అసమానత, జాత్యహంకారాలు దరిజేరనీయక
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం పెంచుతూ
మంచి మానవత్వం మనదని చాటుతూ
సాటివారి కష్టానికి చేయి అందిస్తూ
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న
గురజాడ మాటని అక్షరాలా నిజం చేసిన మనసున్న
మనుష్యులున్న భరతభూమి నా మాతృ భూమిపై 
పెంచుకుకున్నా అనుబంధం తెంచుకోలేక
ఉండి పోతా తుది శ్వాస వరకు ఈ గడ్డ పైనే..!!

 

--మంజు యనమదల    

Back to Top