తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు
- July 23, 2021
హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.రోడ్లు మునిగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. నిర్మల్, భైంసా పట్టణాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. కుమురంభీం జిల్లా వాంకిడిలో నిన్న అత్యధికంగా 27.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షాలకు గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం వెంకూరు చెరువుకట్ట తెగడంతో చేను పనులకు వెళ్లిన దంపతులు చిక్కుకుపోగా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కుమురం భీం జిల్లాలోని చింతలమాదర జలపాతంలో మొన్న గల్లంతైన మహారాష్ట్రకు చెందిన రాంవిజయ్ లోబడే (23) మృతి చెందాడు.
వరంగల్ జిల్లాలో ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. లక్నవరం సరస్సులో 27 అడుగులు, రామప్ప చెరువులో 31 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని రక్షించారు.
ఇదే జిల్లాలోని అనంతారం వాగులోకి గత రాత్రి వేగంగా వచ్చిన ఓ కారు బారికేడ్లను ఢీకొడుతూ వెళ్లి వాగులో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆశ్రమాన్ని వరద నీరు చుట్టేయడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. అల్పపీడనం నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉండాలంటూ అధికారులను ఆదేశించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







