అనాధలను ఆదుకోవడం మన కనీస బాధ్యత: ఉపరాష్ట్రపతి

- August 02, 2021 , by Maagulf
అనాధలను ఆదుకోవడం మన కనీస బాధ్యత: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: అనాధలను ఆదుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు.తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు అనాధలు ఉపరాష్ట్రపతి ని కలిశారు. తమ హక్కులకు సంబంధించిన చట్టం విషయంలో తమకు సహకారం అందించాల్సిందిగా కోరారు.
ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఉపరాష్ట్రపతి, ప్రభుత్వంలోని పెద్దలతో, సంబంధిత మంత్రులతో తప్పకుండా మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఇది కేవలం చట్టాలతో రావలసిన మార్పు కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని తమ బాధ్యతగా గుర్తించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వేతర సేవా సంస్థల ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి ఇవి తక్కువగానే ఉన్నాయన్న ఆయన, ఇది మరింత పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తెలిపారు.
తమ కుమార్తె దీపా వెంకట్ అనాధలైన ఐదుగురు పిల్లలకు స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఆశ్రయం ఇచ్చి వారి బాగోగులు, చదువు విషయంలో చొరవ తీసుకున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయడం ఎంతో ఆనందాన్ని అందిస్తుందన్న ఆయన, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దిశగా ముందుకు రావాలని సూచించారు.అనంతరం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఉపరాష్ట్రపతి చర్చించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com