పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: ఉపరాష్ట్రపతి
- August 07, 2021
న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన గుర్తుచేశారు.
దివంగత సంఘసేవకుడు, ప్రఖర జాతీయవాది చమన్‌లాల్ జీ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్)ను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

చమన్‌లాల్ జీకి ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తదనంతర ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ, దేశ శ్రేయస్సు కోసం చమన్‌లాల్ జీ తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ప్రఖర జాతీయవాదిగా, మేధావిగా గుర్తింపు పొందిన ఆయన, స్వాతంత్ర్యానికి పూర్వమే 1942లో పంజాబ్ (లాహోర్) విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీలో బంగారుపతకాన్ని సాధించినప్పటికీ, సామాజిక సేవ, ఆధ్యాత్మికతత్పరతలోనే జీవితాన్ని గడిపారని ఉపరాష్ట్రపతి అన్నారు.

‘వసుధైవ కుటుంబకం’ను పాటించే భారతీయ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా జీవితాన్ని గడిపిన చమన్ లాల్ జీ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను మాతృదేశంతో అనుసంధానమయ్యేలా, వారిలో జాతీయతాభావం పెంపొందేలా విశేష కృషిచేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. నేటికీ ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయలు, భారతీయ సాంస్కృతిక వారథులుగా, దేశ ప్రతిష్టను పెంచుతున్నారన్నారు.
దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి అండగా నిలవడంలో చమన్‌లాల్ జీ చాలా కృషిచేశారన్నారు.ఆత్యయిక పరిస్థితి (1975 -77) లోనూ చమన్‌లాల్ జీ కీలకంగా వ్యవహరించారన్న ఉపరాష్ట్రపతి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే వెనక్కు తగ్గకుండా, జైలుపాలైన జాతీయవాదుల కుటుంబాలను నిరంతరం పరామర్శిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారన్నారు. చమన్‌లాల్ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, పాతతరం అనుభవానికి కొత్తతరం ఆలోచనలు తోడైతేనే పురోగతి సాధ్యమని నమ్మేవారన్నారు. సరికొత్త బాధ్యతలను స్వీకరించడం, పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త ఆలోచనలను స్వాగతించడంలో చమన్‌లాల్ గారు ఎప్పుడూ ముందుండేవారని పేర్కొన్నారు.
భారతీయతను ప్రతిబింబించే గురు-శిష్య సంప్రదాయం విశిష్టత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, గురువు తన జ్ఞానాన్ని శిష్యులకు పంచడాన్ని మేధోసంపత్తిగా కాకుండా పంచడం ద్వారా పెంచుకోవడంగానే మన దేశ నాగరికత బోధించిందన్నారు. ప్రతి శిష్యుడు తాను గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని మరింత మందికి పంచినప్పుడే ఆ విద్యకు, జ్ఞానానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘జ్ఞానం విశ్వవ్యాప్తం’ అన్న భావనను ప్రతిబింబించే ‘ఆనో భద్రా: క్రతవో యంతు విశ్వత:’ అన్న రుగ్వేద సూక్తిని ఆయన ప్రస్తావించారు.
విశ్వ అధ్యయన కేంద్రం ఏర్పాటులో చమన్‌లాల్ జీ పాత్ర కీలకం అన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచవ్యాప్తంగా భారతీయతను ప్రతిబింబించే అంశంలో విశ్వ అధ్యయన కేంద్రం చేస్తున్న కృషిని ప్రశంసించారు.చమన్‌లాల్ జీ శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విశ్వ అధ్యయన కేంద్రం నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ శాఖ సహాయమంత్రి దేవ్ సింగ్ చౌహాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్, పలువురు పార్లమెంటు సభ్యులు, భారతీయ తపాలా శాఖ అధికారులు, విశ్వ అధ్యయన కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







