Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

- August 30, 2021 , by Maagulf
Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక్కరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ లేఖరా పసిడి ముద్దాడగా దేవేంద్ర జజారియా, యోగేశ్‌ కతునియా రజతాలు కైవసం చేసుకున్నారు. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్యంతో మురిపించాడు.

భారత షూటర్‌ అవనీ లేఖరా పసిడిని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఆర్‌-2 విభాగంలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 249.6 పాయింట్లు సాధించిన అవని ప్రపంచ రికార్డును సమం చేసింది. అంతేకాకుండా పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. మెగాక్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత నాలుగో అథ్లెట్‌గా అవతరించింది. 

మెగా క్రీడల్లో ఆరో రోజు అద్భుతం చేసిన మరో ఆటగాడు యోగేశ్‌ కతునియా. పురుషుల ఎఫ్‌56 డిస్కస్‌ త్రో పోటీల్లో రజతం కైవసం చేసుకున్నాడు. డిస్క్‌ను ఆరో దఫాలో 44.38 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. భారత మాత ముద్దుబిడ్డ దేవేంద్ర జజారియా.. పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్‌ పారాలింపిక్స్‌ విజేతగా అవతరించాడు. జావెలిన్‌ త్రోలో 2004, 2016లో స్వర్ణ పతకాలు ముద్దాడిన అతడు ఈ సారి రజతం అందుకున్నాడు. ఈటెను 64.35 మీటర్లు విసిరి అత్యుత్తమ వ్యక్తిగత రికార్డునూ నెలకొల్పాడు. 

జావెలిన్‌ త్రో లోనే మరో ఆటగాడు సుందర్‌సింగ్‌ గుర్జార్‌ కాంస్యం అందుకోవడం గమనార్హం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు ఎఫ్‌46 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఈటెను 64.01 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. దాంతో ఒకే క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com