కొంప ముంచిన కరోనా

- September 05, 2021 , by Maagulf
కొంప ముంచిన కరోనా

గణేష్ డిగ్రీ కాలేజీ లో బోటనీ లెక్చరర్. వాళ్ళు ఉండేది పల్లెటూరికి అక్క, పట్నానికి చెల్లి లాంటి ఊరిలో. కరోనా వలన గత ఆరు నెలలుగా, ఇంటి  నుంచే ఆన్లైన్ క్లాస్సేస్ చెప్తున్నాడు. కంప్యూటర్ ముందర కూర్చున్న మాటే కానీ అతని మనసు మనసులో లేదు. అతని బుర్ర లక్ష ఆలోచనలతో వేడెక్కిపోయి వుంది. తను  ఏమి జరగకూడదని భయపడ్డాడో అదే జరిగింది..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సింది జరిగిపోయింది .. ఇంత కష్టం ఏ మనిషికి రాకూడదు..ఈ  కరోనా వలన వర్క్  ఫ్రొం హోమే అతని కొంప ముంచింది.  

ఇంతకీ అతనికి వచ్చింది..... ???

కరోనా.....??? ..

కానే ..కాదు ........మరి ?? 

ఒ....ళ్ళు మరియు దానితో పాటే, నీకు నేను ఎప్పుడు తోడుగా  ఉంటాను అనే ..  బొ...జ్జ. 

ఎన్నేళ్లు గా తను ఈ ఫిజిక్ మైంటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఫిట్ గా, ట్రిమ్ గా,  శోభన్ బాబులా ఉంటాడని అందరు అంటారు. తానూ కూడా వాళ్ళ ఎక్సపెక్టషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా, మిస్టర్ శోభన్'స్  హెయిర్  స్టైల్, నుదుట మీద వంకీ జుట్టు పడుతూ, కళ్ళకి ఎప్పుడూ  సన్గ్లాస్సెస్, ముందర షర్ట్ పై బటన్స్ తీసేసి, దొరబాబు లా ఉంటాడు. 

 గణేష్ భార్య లత. వాళ్ళ  పేర్లు కి పూర్తి రివర్స్ లో వుంటారు వాళ్ళు. గణేష్ పొట్టిగా  బొజ్జ గణపయ్యలా కాకుండా , పొడుగ్గా, హైట్ కి తగ్గ వెయిట్ లో ఉంటే, లత పెళ్లైన కొత్తల్లో సన్న జాజి మొగ్గ లాగ, నాజూకు గా ఉండేది, 'జాజి!.. జాజి!...' అని ప్రేమగా పిలిచేవాడు. కానీ ఈ పెళ్లైన పది ఏళ్ళల్లో పది  కేజీలు పెరిగి బంతి పువ్వు లా అయ్యింది. 'ఇప్పుడూ  అదే ప్రేమతో పిలుస్తున్నాడు .. కానీ ఉపమానం మారింది ...'మేరిగోల్డ్' అని పిలుస్తున్నాడు.

' అంటే, నేను లావు అయ్యి బంతి పువ్వు లా ఉన్నాననా?' అని ఉక్రోషం గా అడిగింది లత.

'కాదు, నువ్వు  నా బం.గా...రం...మేరిగోల్డ్ ! అని కొంటె గా అన్నాడు గణేష్.

నిన్న తను బయటకి వెళ్తూ, నాన్న, లత మాట్లాడుకోవటం విన్నాడు.' చూసారా మావయ్య, మీ అబ్బాయి కి ఎలా బొజ్జ వచ్చిందో. ఇప్పుడు తెలుస్తుంది మాష్టారు గారికి , అవతలి వాళ్ళని ఊరికే వెక్కిరించటం కాదు అని ' అంది. 

'అవును అమ్మడు, నాకు కొంచెం అనిపించింది వాడికి పొట్ట వచ్చింది అని.' అన్నాడు మాధవరావు.

అకస్మాత్తుగా  గణేష్  కాళ్ళ కింద భూమి కంపించింది, అంత వరకు అతను ఒళ్ళు  వచ్చిన సంగతి గమనించలేదు. గబగబా వెళ్లి వేయింగ్ మెషిన్ చూసేసరికి ... ఇంకేముంది నెత్తి మీద  పిడుగు పడింది ఈ సారి... ఐదు కేజీలు పెరిగాడు. 

ఏనాడు తాను పేపర్ బాయ్ ని  న్యూస్ పేపర్ వెయ్యనివ్వలేదు, ఇంటికి రెండు కిలోమీటర్లు అవతల కూల్ డ్రింక్ షాప్ కి  వెళ్లి, అక్కడే ఆ రోజు న్యూస్ పేపర్  కొనుక్కుని చదువుతూ, టీ తాగి మళ్ళీ ఇంటికి వచ్చేసే వాడు. రోజూ పాలు,  తాజా కూరలు దారి లో కొనుక్కొచ్చేవాడు.వాన పడుతున్నా గొడుగు వేసుకుని కనీసం రెండు  కిలోమీటర్లు అయినా నడిచే వాడు. మిగతా రోజలు  ఖచ్చితంగా  ఐదు కిలోమీటర్లు పొద్దున్న నడిచేవాడు. ఎక్కడికి  వెళ్ళినా నడిచే వెళ్లే వాడు, బైక్, కార్ వున్నా ఎప్పుడో కానీ తీసేవాడు కాదు.
 ఈ కరోనా వలన బయటకి వాకింగ్ కి వెళ్ళటమే లేదు. ఇంట్లో యోగా చేస్తున్నాడు కానీ క్యాలోరిస్ ఖర్చవ్వట్లా. అదే పని గా కూచుని క్లాస్సేస్ చెప్పటం మూలాన, 'హలో మాష్టారు, మేము మీకు తోడుగా ఉంటాము  అంటూ వచ్చేసాయి ఒళ్ళు,బొజ్జ'.  

 "నన్ను అనటం కాదు మావయ్య, నేను ఇంకా పది ఏళ్ళల్లో పది కేజీ లు పెరిగాను. ఈయన ఐదు నెలలు లోనే ఐదు కేజీలు పెరిగారు. వెయిట్ గైనింగ్ రేస్ లో నన్ను దాటి రికార్డు బద్దలు కొట్టేట్టున్నారు" అని నవ్వింది.

అత్తగారు ఎప్పుడో కాలం చేసింది. మాధవరావు కోడలిని కూతురుకంటే ఎక్కువగా చూసుకుంటాడు, లత కూడ మావగారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందుకే వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఆప్యాయత అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. గణేష్ మీద కూడా చెప్పుకుంటారు.

'ఈయన కష్టార్జీతమ్ వృధా అవ్వకూడదనే కదా, పిల్లలకి  అన్నం పెడుతున్నప్పుడు, వాళ్ళు పారేస్తే   అయ్యో ! బోల్డు  నెయ్యి వేసి కలిపా, బోల్డు జీడిపప్పులు పోసా తిరగమోత లో, వేస్ట్ అవుతాయి అని నేను తిని లావెక్కింది'. అదే కనక, చేసి ఉండకపోతే నేను సినిమా యాక్టర్ లానే  ఉండేదాన్ని కాదా ' అని గతం తలుచుకుని, కొంగుతో ముక్కు తుడుచుకుంది.

మాధవరావు కోడలు బాధపడుతుంటే చూడలేడు.అందుకని కోడలి మనసుని  డైవర్ట్ చెయ్యటానికి, 

'ఇదిగో అమ్మడు, వాడు ఏదో అన్నాడని నువ్వు ఏమి బాధ పడకు , పెళ్లి  ఐన మొదట్లో మీ అత్తగారు మల్లె తీగ లా ఉండేది. మొదట్లో మేము ఇద్దరం ఒకే రిక్షా లో ఎక్కే వాళ్ళం. ఇద్దరం కూచున్నా సీట్ లో ఇంకా జాగా ఉండేది. పిల్లలు పుట్టిన నాలుగు ఏళ్ళకి ,ఆవిడ బానే  ఒళ్ళు చేసింది, రిక్షా ఆవిడ ఒక్కతే ఎక్కితే నేను పక్కన  సైకిల్ మీద వెళ్లే వాడిని.. అంటూ ఇది వరకు కనీసం  ఒక వెయ్యి సార్లు అన్నా చెప్పిన ఫ్లాష్ బ్యాక్  లోకి వెళ్ళాడు.

లత  'మావయ్య, వంట చెయ్యాలి' అంటూ కట్ చేసిన కూరలు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. 

గణేష్ ఏమైనా సరే ఒక నెల రోజులు లోగా ఐదు కేజీలు తగ్గిపోవాలి అని గూగుల్ అంతా శోధించి, ప్రఖ్యాతి గాంచిన న్యూట్రిషనిస్ట్  సుజుతా దినకర్  యూట్యూబ్ వీడియోస్ లో సెలబ్రిటీ వాళ్ళు ముప్పయ్యి కేజీలు, నలభయి కేజీలు ఎలా తగ్గారో చూసి ఎగిరి గంతేశాడు. తాను ఎంత, ఆఫ్టర్ అల్ ఐదు కేజీలు ఇట్టే తగ్గిపోతాడు, అని ఆవిడ డైట్ ప్లాన్ తూచా తప్పకుండ ఫాలో అయ్యాడు.  నెయ్యి తినచ్చు, రోజుకు ఏడు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ ఎదో ఒకటి తినవచ్చు. ఇలా  ఒక నెల అయ్యాక చూస్కుంటే ఇంకో రేండు కేజీలు పెరిగాడు,  మితంగా తినాలి అన్న మాట మిస్ అయ్యి మోసపోయాడు.  ఇది వర్కౌట్ కాదు లే అని పక్కన పడేసాడు.

తర్వాత యూట్యూబ్ లో జాపనీస్ వాళ్ళ టెక్నిక్ చూసి లత తో 'చూడు లత ,  సింపుల్ గా ఒక టర్కీ టవల్ ని చుట్టి నడుం కింద పెట్టి కాలిబొటన వేళ్ళు , చేతి చిటికెన వేళ్ళు తగిలేటట్టు  ఐదు నిమిషాలు పెట్టుకుంటే చాలు. ఎక్సరసైజ్ చెయ్యక్కర్ల , డైటింగ్ చెయ్యక్కర్లేదు, ఇది నువ్వు కూడా చెయ్యచ్చు... 

నేను అయితే  హ్యాపీ గా, ఐదు నిమిషాలు ఏంటి . రోజుకి పావు గంట చేస్తా మూడు పూటలా.  అప్పుడు, నా పొట్ట కరిగిపోతుంది అని గణేష్ అంటే. 

'అప్పుడు,నడుం.. రాముడు విరిచిన శివ ధనుస్సు లాగ అవుతుంది. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి' అని అంది. సొంత తెలివితేటలు వాడద్దు అని అనబోయి భర్త మీద గౌరవం తో   ఆగిపోయింది. 

అది కూడా  ఒక రెండు వారాలు ట్రయ్ చేసాక, ఇది లాభం లేదు అని ఆపేసాడు చెయ్యటం.

 గూగుల్ అంతా దున్నేసి ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ కి ఫిక్స్ అయ్యాడు. దృఢనిశ్చయం తో చేద్దాం అని ఈ  సారి లీవ్ కూడా పెట్టేసాడు .

అతని ఫాస్టింగ్ విండో , సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున్న పది వరకు, ఏమి తినకూడదు.


ఆరింటికే భోజనం చెయ్యటం వలన గణేష్ కి  పదింటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, నిద్ర పట్టట్లేదు. ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకి తింటానికి ఏమన్నా ఉన్నాయేమో అని వంటింట్లో కి వెళ్లి వెతుకుతుంటే, గిన్నెల చప్పుడుకి ఇంటిల్లిపాది లేచారు. 

లత వచ్చి ప్లేట్ లో అన్నం, కూర  వేసి ఇస్తే   ఆవురావురు మంటూ  తింటుంటే.. పెద్ద కూతురు , ' డాడీ,ఇదేమి డైటింగ్, ఇప్పుడు తింటే ఇంకా కొలెస్ట్రాల్ పెరుగుతుంది' అంది.

'నువ్వు ముందర మాట్లాడకుండా వెళ్లి పడుకో' అని కూతురుని  కోప్పడింది లత.

 పొద్దున్న కాఫీ, టిఫిన్లు , వెంటనే గణేష్ కోసం పది గంటలకే భోజనం తయారు చెయ్యటం, తర్వాత మిగతా వాళ్ళ భోజనాలు,  సాయంత్రం టీ లు, మళ్ళీ  ఐదు గంటల కే  వంట చెయ్యటం, తర్వాత పిల్లలకి, మావగారికి భోజనం పెట్టటం ఇంకా ఇరవయ్యి నాలుగు గంటలు వంటా వార్పూ తోటే హైరానా అవుతోంది లతకి . 

క్యాలోరిస్ లెక్క పెట్టుకుంటూ తినటం వలన అతనికి మొదట కొద్దీ రోజులు ఉన్న శక్తీ తర్వాత చాల లేదు. తలనొప్పి, వేడి చేసి కాళ్ళు లాగెయ్యటం, కడుపులో అసిడిటీ మొదలయ్యింది. గట్టిగా వారం కూడా అవ్వలా. 

ఇలా కాదు అని ఫాస్టింగ్ విండో  రాత్రి ఎనిమిది నుంచి పొద్దున్న పన్నెండు కి మార్చుకున్నాడు. పొద్దున్న లేచి వాకింగ్ చేసి వచ్చేసరికి  లత తనకి ఇష్టమైన గారెలు, అల్లం పచ్చడి చేసింది.

'మీకిష్టమైన గారెలు చేశా తింటారా? అంది. 

 కొంపదీసి తను నా మీద కసి తీర్చుకోవట్లేదు కదా,తనకి  ఇష్టమైనవన్నీ చేసి అని డౌట్ వచ్చింది.

'లేదు,పని ఉంది'  అని గబగబా రూమ్ లోకి వెళ్తుంటే, చిన్నది ఆపి ,  'ఏంటి డాడీ, గారెలు వాసన తోటే స్టమక్ ఫుల్ అయ్యిందా నీకు?' అని అమాయకం గా అడిగింది

ఆ  టెంప్టేషన్ ని కంట్రోల్ చేసుకునేసరికి  తలప్రాణం తోక కి వచ్చింది 

ఇలా రోజు వంటల ఘుమ ఘుమలకి, ఆకలి కంట్రోల్ చెయ్యాలంటే కళ్ళ ముందర  ఆ పరమాత్ముడే కనపడుతున్నాడు.ఫాస్టింగ్ విడిచే ఆ చివరి అరగంట ఒక్కో క్షణం ఒక్కో యుగం లా వుంది.. ఎన్ని సార్లు గడియారం వంక చూశాడో తనకే తెలియదు.

 కడుపు నకనక లాడుతుంటే, 'లత, పిలిచావా.. అప్పుడే భోజనం టైం అయ్యిందా?' అంటూ వచ్చాడు.

'లేదు మీ లంచ్ టైం కి ఇంకా రెండు గంటలు ఉంది' అంది.

'పిలిచినట్టు అనిపిస్తేను' అని అతను అనుకుంటూ వెళ్తుంటే.మావగారి వంక చూసి నవ్వింది. 

తర్వాత జాలి వేసి తను గణేష్ దగ్గరకి వెళ్లే సరికి మామగారు మాట్లాడుతున్నారు గణేష్ తో  .. 'ఎందుకు అంత కడుపు మాడ్చుకుంటున్నావు రా .. ఒళ్ళు వచ్చినంత  
ఈజీ గా తగ్గదు. నువ్వు  హెల్తీ  వెయిట్ రేంజ్ లోనే ఉన్నావు కదా, వారం అయ్యింది, పది రోజులు అయ్యింది  ఇంకా తగ్గలేదు అంటూ ఇన్స్టంట్ రిజల్ట్స్ కోసం ఆదుర్దా పడకు రా .  వారానికో అర కేజీ తగ్గేట్టు, దానికి తగ్గట్టు ఎక్సరసైజ్, డైట్ ప్లాన్ చేసుకుని ప్రయత్నించు.' అని అన్నాడు.

  'మీరు చేస్తున్న దానికి నేను ఇన్స్పయిర్ అయ్యి, నా  పధ్ధతిలో నేను చేసుకుంటూ వెళ్తే ఈ రెండు నెలలు లో నేను రెండు కేజీలు తగ్గాను. మన బాడీకి  సూట్ అయ్యేది చెయ్యాలండి.  నేను ఇంకో ఎనిమిది కేజీలు ఓవెర్వెయిట్ .. ఇంకో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో  తగ్గుతాను' అని అంది.

'ఏదయినా నీ శక్తీ, ఓపిక కొద్దీ చిన్న గా మొదలు పెట్టి, శరీరం అలవాటు పడ్డాక ఎక్కువగా చెయ్యి.' అన్నాడు మాధవరావు.

ఇద్దరు కలిసి మేష్టారు గారికే పాఠాలు చెప్పేసారు.

వాళ్ళ మాటలు విన్నాక తన పధ్ధతి మార్చుకున్నాడు, ఒకే సారి పదహారు గంటలు కాకుండా, పన్నెండు గంటలకి మార్చాడు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. ఆ మరుసటి వారం నుంచి కరోనా తగ్గటం వలన, గణేష్ తో పాటు లత కూడా రెగ్యులర్ గా వాకింగ్ కి వెళ్ళింది, ఇది వరకటి లాగా నే మోడరేట్ గా తినటం వలన, పన్నెండు గంటల ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ తో  నెమ్మదిగా ఇద్దరు బరువు తగ్గారు.

--జానకి జ్యోతి విశ్వనాధ(సింగపూర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com