త్వరలో విజిట్ వీసాలు ప్రారంభం

- September 05, 2021 , by Maagulf
త్వరలో విజిట్ వీసాలు ప్రారంభం

కువైట్ సిటీ: కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ దాదాపు ఏడాదిన్నర తర్వాత విజిట్ వీసాల జారీకి అనుమతి ఇచ్చింది. కువైత్‌కు వచ్చే ప్రవాసులకు త్వరలోనే అన్ని రకాల విజిట్ వీసాలు(ఫ్యామిలీ, కమర్షియల్, టూరిస్ట్) జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల కువైట్ మంత్రిమండలి వివిధ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానశ్రాయనికి డైలీ వచ్చే ప్రయాణికుల సామర్థ్యాన్ని కూడా 10వేలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ కువైట్ సందర్శనకు వచ్చే ప్రవాసల కోసం విజిట్ వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. 

అయితే, ప్రస్తుతం కరోనా ఎమర్జెన్సీ కమిటీ ద్వారా కమర్షియల్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అవి కూడా కేవలం హెల్త్ ఎమర్జెన్సీ(చికిత్స కోసం కువైట్ వచ్చేవారికి), లేబర్ మార్కెట్‌కు అవసరమైన సిబ్బంది(అడ్వైజర్స్, ఇంజనీర్స్, టెక్నిషియన్స్, టీచర్లు), విద్యార్థులకు మాత్రమే విజిట్ వీసాలు ఇస్తోంది. అలాగే మానవత ధృక్పథంతో విదేశాల్లో చిక్కుకున్న కొందరు ప్రవాసులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, పిల్లలు, భాగస్వాములను తిరిగి కలవడానికి కమిటీ విజిట్ వీసాలను మంజూరు చేస్తోంది. ఇక కరోనా కాస్తా తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే సాధారణ జీవనంవైపు అడుగులేసేందుకు సిద్ధమవుతున్న కువైత్.. తాజాగా కువైత్ రావాలనుకుంటున్న ప్రవాసులందరికీ విజిట్ వీసాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను అంతర్గత మంత్రిత్వశాఖ ప్రారంభించనుంది. 

ఇదిలాఉంటే.. ప్రస్తుతం కువైట్లో 1,50,000 మంది రెసిడెన్సీ నియమాలను ఉల్లంఘించిన వారు(చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్నవారు) ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు మళ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దేశం నుంచి బహిష్కరించాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 3,90,000 మంది ప్రవాసులు కరోనా కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విదేశాల్లో చిక్కుకుపోయి వారి రెసిడెన్సీ పర్మిట్లను కోల్పోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.  

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com