ఆఫ్ఘన్‌ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం: కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌

- September 09, 2021 , by Maagulf
ఆఫ్ఘన్‌ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం: కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌

న్యూఢిల్లీ : ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డను వాడుకోవడాన్ని ఎంత మాత్రమూ ఉపేక్షించేది లేదని భారతదేశం స్పష్టం చేసింది. ఇది ఎవరు చేపట్టినా ఆమోదయోగ్యం కాదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు. ఈ విషయంలో తమ ప్రకటనలను తాలిబాన్‌ సమర్థించాలని కూడా ఆయన సూచించారు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌పై నిర్వహించిన సదస్సులో జైశంకర్‌ మాట్లాడారు. ఈ సదస్సును అమెరికా మంత్రి ఆంథోని బ్లింకెన్‌తోపాటు జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి హీకో మాస్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో హింసను ప్రేరేపించేందుకు బయటి నుంచి ఎవరు జోక్యం చేసుకున్న ప్రపంచ దేశాలు సహించకూడదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మంత్రి జైశంకర్‌ అన్నారు. కాబూల్‌ నుంచి తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం తన ప్రాధాన్యతగా భావిస్తున్నట్లు జైశంకర్‌ చెప్పారు. ఈ విషయాలను ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్, ఉగ్రవాద గ్రూపులతో పాకిస్తాన్ సంబంధాల గురించి అమెరికా, బ్రిటన్‌, రష్యాలోని అత్యున్నత భద్రత, నిఘా అధికారుల వద్ద భారతదేశం తన ఆందోళనలను ఇప్పటికే తెలియజేసింది. ఇటీవల ఈ మూడు దేశాల అధికారులతో సమావేశం సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద గ్రూపులు జైషే మహమ్మద్‌, లష్కర్‌ ఏ తోయిబా వంటి వాటితో పాకిస్తాన్‌కు చెందిన గూఢచార ఏజెన్సీ ఐఎస్‌ఐ సంబంధాలను కలిగి ఉన్న విషయాన్ని భారత్‌ ఉన్నతాధికారులు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com