యాక్టింగ్ సరదా @ "వంగవీటి"

- March 17, 2016 , by Maagulf


అనేకమైన సరదాల్లో నటన కూడా ఒక సరదా. అది కూడా సినిమా నటన మరీను. ప్రొఫెషనల్ గా నటిస్తున్నవారిని చూసి తాము కూడా వారికి మాత్రం తీసిపోమనే భ్రమలోంచి సరదా పుట్టుకొస్తుంది! తరచూ కేస్టింగ్ డైరక్టర్స్ కి ఇలాంటి సరదాపరుల అనుభవం ఉంటూనే ఉంటుంది. మధ్య "వంగవీటి" సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ నాకు కూడా రోజూ పదికి తక్కువ కాకుండా ఫోటోలు, వీడియోలు పంపుతున్న సరదా పరులు ఉన్నారు. సినిమాలో అందరూ కొత్తవాళ్లే ఉండబోతున్నారు అనే ప్రచారం ఒకటి ధాటికి కారణం. దానికి తోడు ఆర్జీవి ఇది తన చివరి తెలుగు సినిమాగా ప్రకటించడం మరో కారణం. సరదాపరులంతా నటనికి పూర్తిగా కొత్త. కానీ నటించలానే కుతూహలం. నా ద్వారా ఆర్జీవిని చేరితే అవకాశం వస్తుందని వారి ఆలోచన. తప్పులేదు. కానీ వాళ్ల సరదా నా సరదా తీర్చెస్తోంది.
దూకుడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ పాత్ర లాంటి మహానుభావులు కూడా ప్రొఫైల్స్ పంపుతున్నారు.
"నన్ను చిన్నప్పుడు రాజీవ్ గాంధీలా ఉంటావు అనేవారండీ. పాత్రకి సెట వుతానేమో చూడండి", అంటూ బట్టతల తప్ప మాత్రం రాజీవ్ గాంధీకి పోలికలేని ఫేసుతో ఒకరు.
"కాలేజీలో అప్పుడప్పుడు నాటకాలు వేసేవాడిని. చేస్తే ఆర్జీవీ సినిమాలోనే చెయ్యాలనుకున్నాను. ఆయన లాస్ట్ సినిమాలో నటించే అవకాశం ఇప్పించగలరు. కామెడీ అయినా పర్లేదు." అంటూ ఒక లెక్చరర్.
వంగవీటిలో కామెడీ ఏమిటి?
"రామూ గారి పరిచయం కావాలి. మీరు నన్ను రికమెండ్ చేయక్కర్లేదు. నన్ను చూసాక ఆయనే కమిట్ అయిపోతారు చలసాని పాత్రకి", అని ఒక పెద్దాయన.
"రంగాగారి హత్య టైములో నేను విజయవాడలోనే ఉన్నాను. కనుక సినిమాలో నటించే పూర్తి హక్కు నాకుంది" అని ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు.
"నేను నెహ్రూగారి పాత్రకి సరిపోతాను. సరిపోనని మీరు అనుకున్నా పర్లేదు. నా ఫోటోని ఆర్జీవికి పంపకుండా ఉండకండి. మీ పని మీరు చేయండి. ఆయన నుంచి నాకు డైరెక్ట్ గా కబురొస్తుంది", ఇలా ఒకాయన.
ఇదీ పరిస్థితి.
వారందరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. "సరదా" గురించి సరదాగా ప్రస్తావిస్తున్నాను అంతే.
వీళ్లెవరూ కృష్ణ నగర్లో ఉంటూ సినిమాల్లో బ్రేక్ కోసం పరితపిస్తున్నవాళ్లు కాదు. వేరే రంగాల్లో బాగానే సెటిల్ అయిన ఒట్టి సరదాపరులు అంతే
వీళ్లకి ఒక డయాలగ్ ఇచ్చి చెప్పమంటే చుక్కలు చూపించారు. ఎక్స్ప్రెషన్, మాడ్యులేషన్, పాజ్ ఏవీ లేవు. అవన్నీ చెప్పి చేయించాలంటే అది నా వల్ల అయ్యేది కాదు. అందుకే సైలెంట్ గా "వంగవీటి" అసోసియేట్ డైరెక్టరుకి ప్రొఫైల్స్ , వీడియోస్ పంపించాను. "ఎందుకు సార్! ఇలా నామీద కసి తీర్చుకుంటారు" అని అతను వాపోయాడు. ఇంతకన్నా విపులంగా చెప్పలేను.
ఒక పెద్ద వ్యాపారవేత్త కూడా సినిమాలో నటించాలనే ఉత్సాహం చూపించారు నా ముందు. ఆయనకి ఒక డయలాగ్ ఇచ్చి చెప్పమన్నాను. ప్రయత్నించి "నా వల్ల కావట్లేదు. దెబ్బకి నాకు యాక్టింగ్ ఎంత కష్టమో అర్థమయింది. నా ఆలోచన విరమించుకుంటున్నాను" అన్నారు.
నిజాన్ని గ్రహించడం అంటే అది.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నటన అనేది చాలా కష్టతరమైన పని. అది అందరికీ సాధ్యం కాదు. చెట్టుక్కాసిన కాయ కాదు, అందుబాటులో ఉన్నవాడు కోసి ఇచ్చేయడానికి. సరదాకి నటించాలనుకోవడం తప్పు కాదు కానీ, నటనని తేలిగ్గా తీసుకోవడం తప్పు అని నా ఫీలింగ్.

--సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com