మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ' కాసేపు ...
- March 18, 2016
పాటలోనే కాదు... మోహన్‌బాబు మాటల్లోనూ సరిగమలు పలుకుతుంటాయి. సంభాషణలు పలకడంలో అదే ఆయన ప్రత్యేకత. హీరో పాత్రలో ఉన్నాడంటే 'అరిస్తే చరుస్తా' అంటూ తన మాటలతోనే ప్రతినాయకుడిని చిత్తు చేసేస్తుంటాడు. అదే ప్రతినాయకుడి పాత్ర అనుకోండి అదే మాటతోనే ఎదురుగా ఉన్న కథానాయకుడి పాత్రని మరో స్థాయికి తీసుకెళతాడు. ఎక్కడ ఏ మాటని ఎలా నొక్కాలో, ఎలా పైకి లేపాలో ఆయనకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. 'అన్నగారు ఎన్టీఆర్ తర్వాత సంభాషణలు చెప్పడంలో నేనే' అని చెప్పుకోగలిగేంత స్థాయి ఉన్న ఏకైక నటుడు మోహన్‌బాబు. నటుడిగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు.ఇటీవల నలభయ్యేళ్ల సుదీర్ఘ నట ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు. శనివారం మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ' కాసేపు
పుట్టినరోజు అనగానే మీకు గుర్తుకొచ్చే విషయం ఏంటి? నటుడినయ్యాక నాలుగేళ్ల వరకు నేను పుట్టినరోజు చేసుకోలేదు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నటుడివయ్యావు కాబట్టి పుట్టినరోజు చేసుకోవడం, అది ప్రజలకి తెలియజేయడం మంచిదే అని, చేసుకుంటే బాగుంటుందని కొందరు చెప్పడం, నా సీనియర్లు చేసుకోవడం చూసి మొదలుపెట్టాను. 1992 వరకు మద్రాసులో నా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఇన్‌స్టిట్యూట్స్ స్థాపించినప్పట్నుంచి అక్కడే పిల్లల మధ్యే పుట్టిన రోజును జరుపుకొంటున్నా. సినిమా పరిశ్రమలో కాకుండా అక్కడ ఎందుకు నా పుట్టినరోజులు జరుగుతాయంటే... సినిమా పరిశ్రమలో విజయం ఉంటేనే పదిమంది వస్తారు. అదే ఒక్క పరాజయం ఎదురైందంటే వంద మైళ్లు దూరంగా ఉంటారు. అంతా కృత్రిమ జీవితాలు. అందుకే దేవుళ్లతో సమానమైన పిల్లల మధ్య పుట్టినరోజును జరుపుకోవాలని నిర్ణయించుకొన్నా. ఈసారి నా విద్యాసంస్థలోనే వెంకటేష్, శత్రుఘ్నసిన్హా, జీఎమ్‌ఆర్, వరప్రసాద్‌రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి తదితర ఆత్మీయుల మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడంలాంటివి ఏమైనా చేస్తుంటారా? మంచి నిర్ణయం అనుకొంటే దాన్ని ఆ క్షణంలోనే ఆచరణలో పెట్టడం నా అలవాటు. అంతే తప్ప పుట్టినరోజునాడే నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఉండదు. ఈసారి పుట్టినరోజు నుంచి మా నాన్నగారు ఉపాధ్యాయుడు నారాయణస్వామి నాయుడు పేరుతో ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందజేయాలనుకుంటున్నా. నాన్నగారు, నేనూ... ఉపాధ్యాయులమే. నాన్న పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ఉపాధ్యాయుల్ని ఒక కమిటీ ద్వారా ఎంపిక చేసి పురస్కారాల్ని అందజేయాలని నిర్ణయించుకున్నా. నేనూ ఉపాధ్యాయుడినే అంటున్నారు. ఇప్పుడూ పాఠాలు భోదిస్తుంటారా? క్యాంపస్‌లో ఉంటే రోజూ విద్యార్థుల్ని పలకరిస్తుంటా. పిల్లలకి ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా మెలుగుతుంటా. నాకు నటన అంటే ఎంతిష్టమో, భోదన అన్నా అంతే ఇష్టం. పూర్వాశ్రమంలో మీరో ఉపాధ్యాయుడు. ఆ వృత్తిపై మక్కువతో విద్యాసంస్థలు నెలకొల్పారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు, మరి దర్శకత్వం ఎప్పుడు చేస్తారు? ఆ ఆశ, కోరిక నాకూ ఉంది. ఒక చిన్న భయం. ఐదుగురు నటులుంటే వాళ్లల్లో ఒక్కరే క్రమశిక్షణతో మెలుగుతుంటారు. ఆ లెక్కన రోజుకి నలుగుర్నైనా కొడతానేమో! అప్పుడు మళ్లీ అపవాదుని మూటగట్టుకోవల్సి వస్తుంది. అందుకే దర్శకత్వం నాకు కరెక్టు కాదేమో అని దూరంగా ఉన్నా. ఇటీవల నటుడిగా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. కారణమేంటి? పిల్లలు నటిస్తున్నారు, మళ్లీ నేనెందుకులే అనుకొని విద్యాలయాలపై దృష్టిపెట్టా. మధ్యలో ఏదైనా మంచి కథ వస్తే కాదనకుండా చేస్తున్నా. చాలా కథలు నా దగ్గరికొస్తుంటాయి. ఆ కథలో నాణ్యత, దర్శకుడు, నిర్మాత... ఇలా అన్నీ చూసుకొని సినిమాలు చేస్తున్నా. నటన గురించి కొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఇంతకుముందు చేయని పాత్ర చేసుంటే బాగుండేదనే కోరిక మనసులో ఎప్పుడూ ఉంటుంది. నాకే కాదు, ప్రతి నటుడికీ అలాంటి ఆశ ఉండాలి. 'కన్నప్ప' అనే సినిమా చేయబోతున్నాం. అందులో నేనూ ఓ అద్భుతమైన పాత్ర పోషిస్తా. ఆ పాత్ర గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అలాగే విష్ణుబాబు, మనోజ్‌తో రెండు కథలు అనుకుంటున్నాం. భారీ వ్యయంతో తెరకెక్కే ఆ చిత్రాలకి దర్శకులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. లక్ష్మీప్రసన్న నిర్మాతగా వ్యవహరిస్తుంది. నేనొక మార్గదర్శిగా ఆ చిత్రాల్ని ముందుకు నడిపించాలి. నలభయ్యేళ్ల అనుభవమున్న మీలోని నటుడిని నేటితరం దర్శకులు వినియోగించుకొంటున్న తీరుపై మీరు సంతృప్తిగానే ఉన్నారా? నన్ను వినియోగించుకోవడంలేదే అని బాధేమీ లేదు. అది దర్శకుల ఇష్టం. అద్భుతమైన కథలు దొరకలేదే, మంచి పాత్రల్ని సృష్టించడం లేదే అన్న భావనైతే మనసులో ఉంటుంది. ప్రతినాయకుడు, కథానాయకుడు, సహనటుడు... ఇలా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయారు. వీటిలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన పాత్ర ఏదంటే ఏం చెబుతారు? ప్రతినాయకుడి పాత్రని ఎంతగానో ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఆ పాత్ర అంటే ఎప్పటికీ ఇష్టమే. ఎన్నో హావభావాలు పలికించడానికి ఆస్కారమున్న పాత్ర అది. కథానాయకుడికైనా పరిమితులుంటాయేమో కానీ ప్రతినాయకుడి పాత్రకి ఉండవు. నా దృష్టిలో ప్రతినాయకుడే గొప్పవాడు. మీ పిల్లలకి నటన, నిర్మాణం పరంగా ఏమైనా సలహాలిస్తుంటారా? ఎవరి జీవితాలు వాళ్లవి, ఎక్కువగా సలహాలివ్వకూడదు. వెనకుంటూ ప్రోత్సహిస్తూ మంచి చెడుల్ని చెబుతుంటానంతే. లక్ష్మీ, విష్ణు, మనోజ్... బాధ్యతలు తెలిసిన మంచి పిల్లలు. నటులుగా విజయవంతమయ్యారు. ఒక సినిమా హిట్టయినంత మాత్రాన ఎవరూ గొప్పవాళ్లు కాదు. మంచి నటులుగా నిరూపించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు. ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణంపై మీ అభిప్రాయమేంటి? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నారు. కానీ మనకంటే దేవుడు గొప్పవాడు. పరిశ్రమలో గౌరవం, విలువలు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయిప్పుడు. నిన్నటితరం విలువలు మళ్లీ రావాలి. బాబూ... తాత... అంటుంటారు... ''మా ఇంట్లో అల్లరే అల్లరి. విష్ణు పిల్లలు, లక్ష్మి కూతురు... వాళ్లు చేసే అల్లరితో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాళ్లతో ఆడుకోవడమే నా జీవితం. వాళ్లకి ఖాళీ దొరకడం లేదిప్పుడు. మనకు మూడున్నర సంవత్సరాల వయసులో స్కూలంటే ఏంటో తెలియదు. రెండున్నర వయసులోనే వాళ్లు స్కూలుకెళుతున్నారు. ఉదయం 7.30కి వెళతారు, సాయంత్రం 5.30కి వస్తారు. నా సినిమాల్ని చూస్తుంటారు వాళ్లు. తెరపై నేను కనిపించగానే లక్ష్మీకూతురు బాబు బాబు.. అంటుంది. విష్ణు పిల్లలు తెరపైన నన్ను చూపిస్తూ 'బాబూ..తాత..' అంటుంటారు. ఇంట్లో సినిమా రషెస్ చూస్తున్నప్పుడు నా పక్కకొచ్చి కూర్చుంటారు. రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాళ్లకి సమాధానాలు చెబుతూ ఉండాలి నేను''.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







