ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ..

- October 31, 2021 , by Maagulf
ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ..

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలామంది నటీనటులు ఎంతో కష్టపడ్డారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు.. ఇలా ఎంతోమంది ఉంటారు. అలాంటి ఒక నటుడే కైకాల సత్యనారాయణ. టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే నవరస నటసార్వభౌములలో ఆయన కూడా ఒకరు. అలాంటి నటుడి ఆరోగ్యం ఇప్పుడు క్షీణించింది. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులంతా ఆందోళన పడుతున్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం ఎందరో నటులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఆయన ఆరోగ్యం బాగాలేని రోజుల్లో సినిమాపైనే ప్యాషన్‌తో చిన్న పాత్రలతో అయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. సినిమాలు చేయడం, సినిమావారితో కలిసి సమయాన్ని గడపడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఇదివరకు ఏ అవార్డు ఫంక్షన్ జరిగినా అక్కడికి ఆయన తప్పకుండా వచ్చేవారు. కానీ గతకొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం కొన్నిరోజుల క్రితం చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు కూడా. ఇక నాలుగు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో జారిపడ్డారు. అప్పటినుండి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. నిన్న (శనివారం) రాత్రి నొప్పులు మరీ ఎక్కువగా ఉండడంతో ఆయనను పక్కనే ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. సీనియర్ ఎన్‌టీఆర్‌కు ఎన్నో సినిమాలకు డూప్‌గా నటించారు కైకాల సత్యనారాయణ. అంతే కాక యముడి పాత్రలతో ఆయనకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ లభించింది. సీనియర్ హీరోలతోనే కాదు.. దాదాపు చాలామంది ఈ జెనరేషన్ హీరోలతో కూడా ఆయన కలిసి నటించారు. ఆయన అనారోగ్య వార్త అందరికీ ఆందోళన కలిగిస్తుండగా.. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com